హైదరాబాద్ ఔటర్ రింగ్​ రోడ్డు చుట్టూ మెట్రో రైలు రావాలె: సీఎం కేసీఆర్

హైదరాబాద్ ఔటర్ రింగ్​ రోడ్డు చుట్టూ మెట్రో రైలు రావాలె: సీఎం కేసీఆర్

ఎయిర్ పోర్టు మెట్రో శంకుస్థాపనలో సీఎం కేసీఆర్ 

హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలో కాలుష్య రహిత, ట్రాఫిక్ రద్దీని నివారించే ఏకైక మాస్​ట్రాన్స్​పోర్టేషన్ మెట్రో రైలు అని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్​ రోడ్డు చుట్టూ మెట్రో రైలు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేంద్రం సహకరించకపోయినా భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని, సిటీలోని అన్ని ప్రాంతాలనూ మెట్రోతో కనెక్ట్​చేస్తామని తెలిపారు. బీహెచ్ఈఎల్​నుంచి కూడా మెట్రో రైలు వేస్తామని వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ లోని మైండ్ స్పేస్ వద్ద ఎయిర్ పోర్టు మెట్రోకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం స్టేట్ పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘హైదరాబాద్​ కాస్మోపాలిటన్​సిటీ. ఇక్కడ వివిధ రాష్ట్రాలు, భాషలు, సంస్కృతుల వాళ్లు ఉన్నారు. అన్ని జాతులు, ప్రాంతాల వాళ్లున్న గొప్ప నగరం హైదరాబాద్. 300 ఏండ్ల కిందనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చార్మినార్ గుల్జార్ హౌస్​లో ఉన్నారు. హైదరాబాద్ ఒకప్పుడు ఢిల్లీ కన్నా విశాలమైంది. చెన్నై కంటే ముందే ఇక్కడ కరెంట్ వచ్చింది. విశ్వనగరమైన హైదరాబాద్ ను మరింత గొప్పగా తీర్చిదిద్దుతాం. న్యూయార్క్, లండన్,​ ప్యారిస్ లో కరెంట్​పోతదేమో గానీ హైదరాబాద్​లో క్షణం కూడా పోదు. ఇందుకోసం ఎంతో శ్రమించి పవర్ గ్రిడ్​ఏర్పాటు చేశాం. రాష్ట్రంతో పాటు, జాతీయ స్థాయిలో అన్ని గ్రిడ్​లను అనుసంధానం చేస్తే ఇది సాధ్యమైంది” అని చెప్పారు. 

ఆర్ అండ్ డీ ఫెసిలిటీ ఉండాలె... 

‘‘హైదరాబాద్ ను సేఫ్ సిటీగా భావిస్తున్నారు. ఇక్కడ వాతావరణం కూడా బాగుంటుందని చాలా మంది వస్తున్నారు. జనాభా పెరుగుతోంది. సిటీ బాగా విస్తరిస్తోంది’’ అని కేసీఆర్ చెప్పారు. ఇందుకు అనుగుణంగా సౌలతులు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ పని జరగాలన్నారు. ‘‘సిటీలో విల్లాలు, గేటెడ్​కమ్యూనిటీలు, పెద్ద పెద్ద బిల్డింగులు, ఆఫీసులు వస్తున్నాయని మురిస్తే సరిపోదు. మురుగు నీరు, మంచి నీటి సౌకర్యాలు ఏర్పర్చుకోవాలి. దీనికి విజన్​ ఉండాలి. భవిష్యత్తు అవసరాలు గుర్తించి, అందుకు అనుగుణంగా మున్సిపల్ శాఖ ప్లాన్​చేయాలి. ఇందుకోసం ఒక ఆర్​అండ్​డీ ఫెసిలిటీ ఏర్పాటు చేసుకోవాలి’’ అని సూచించారు. 

ఇది పూర్తిగా స్టేట్ ప్రాజెక్టు.. 

విస్తరిస్తున్న సిటీకి అనుగుణంగా ఇన్​ఫ్రాస్ట్రక్చర్​అవసరమని కేసీఆర్ అన్నారు. ‘‘ఎయిర్​పోర్టులో రెండో రన్​ వే వస్తున్నది. ప్రయాణికుల అవసరాలు పెరుగుతున్నాయి. అందుకే మైండ్ ​స్పేస్ ​నుంచి ఎయిర్​పోర్టు దాకా రూ.6,250 కోట్లతో మెట్రో రైలు ఏర్పాటు చేస్తున్నం. ఈ ప్రాజెక్టు మొత్తం 31 కిలో మీటర్లు. ఇందులో 27 కిలోమీటర్లు ఎలివేటెడ్​ కారిడార్, 2.5 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ లో, మరో కిలోమీటర్​రోడ్డు లెవల్​లో ఉంటుంది. ఇది పూర్తిగా స్టేట్​ప్రాజెక్టు. రాష్ట్ర సర్కార్, హెచ్​ఎండీఏ, జీఎంఆర్ ​కలిసి చేస్తున్న ప్రాజెక్టు” అని తెలిపారు. 4.5 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేస్తున్నారని,  ఎయిర్​పోర్టు మెట్రో పూర్తయితే మరో  80 వేల మంది ప్రయాణికులు పెరుగుతారని పేర్కొన్నారు. కాగా, మెట్రో ప్రాజెక్ట్ నిధులకు సంబంధించి జీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ 10%  చొప్పున అమౌంట్ ను చెక్కు రూపంలో సీఎంకు అందజేశాయి.

ముస్లిం మహిళల ఆందోళన..  

కేసీఆర్ మాట్లాడుతున్న టైమ్ లో కొందరు ముస్లిం మహిళలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. 2017 టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీలో ఉర్దూ మీడియం పోస్టులకు మెరిట్ ప్రకారం నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేసిన మహిళలను పోలీసులు అక్కడి నుంచి బయటకు పంపించారు.