- 8 కోట్ల పనిదినాల లక్ష్యంపై సర్కార్ ఫోకస్
- నీటి సంరక్షణ పనులకే తొలి ప్రాధాన్యం
హైదరాబాద్, వెలుగు: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు పల్లెల్లో జోరందుకున్నాయి. ఈ నెలలో ఎండలు, సాంకేతిక సమస్యల వల్ల లక్షలోపు ఉన్న కూలీల హాజరు.. ఇప్పుడు ఏకంగా 16 లక్షలకు చేరుకోవడం విశేషం. జూలై 1 నుంచి కేంద్రం కొత్త నిబంధనలు అమలు చేయనున్న నేపథ్యంలో 8 కోట్ల పనిదినాలను చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది.
ఈనెల మొదటి వారంలో కేవలం 7 లక్షలుగా ఉన్న కూలీల సంఖ్య.. ప్రస్తుతం 16.24 లక్షలకు చేరింది. గ్రామాలవారీగా ఇన్చార్జిలను నియమించి, పని అడిగిన ప్రతిఒక్కరికీ ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఉపాధి పనుల్లో నల్గొండ టాప్..
ఉపాధి హామీ పనుల్లో వికారాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, రాజన్న సిరిసిల్ల జిల్లాలు లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ప్రతిరోజూ 1.23 లక్షల మంది కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. అయితే, గద్వాల్, రంగారెడ్డి, నారాయణపేట్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో హాజరు తక్కువగా ఉండటంతో అక్కడ కూలీల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది.
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని భూగర్భ జలాలను పెంచాలనే లక్ష్యంతో ముందుకుసాగుతోంది. చెరువులు, కుంటలు, కాలువల్లో పూడికతీత పనులను వేగవంతం చేసింది. ప్రతి గ్రామంలో కనీసం మూడు నీటి సంరక్షణ పనులు చేపట్టాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
