
హైదరాబాద్, వెలుగు: నర్సింగ్ ఆఫీసర్లు(స్టాఫ్ నర్స్) పరీక్షా ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. గత నవంబర్ లో 2,322 నర్సింగ్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ‘కంప్యూటర్ బేస్డ్ టెస్ట్’ నిర్వహించింది. ఈ ఉద్యోగాలకు దాదాపు 42,244 మంది నర్సులు దరఖాస్తు చేసుకోగా 40,423 మంది హాజరయ్యారు. పరీక్షలు రాసి దాదాపు ఐదు నెలల తరువాత ప్రభుత్వం ఫలితాలను విడుదల చేసింది. మెడికల్ బోర్డు వెబ్‌సైట్‌లో (https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm) మార్కులను అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు తమ మార్కుల వివరాలను చెక్ చేసుకోవాలని మెడికల్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం నార్మలైజ్డ్, ఫైనల్ కీ మార్కులు మాత్రమే విడుదల చేశామని, ఇదివరకే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్స్ ఉద్యోగులుగా పనిచేస్తున్న అభ్యర్థులకు వేయిటేజీ మార్కులు కలిపిన తరువాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తామని బోర్డు తెలిపింది. కాగా, ప్రభుత్వం గతేడాది 6,956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసింది. ఈ ఏడాది మరో 2,322 పోస్టులను భర్తీ చేస్తున్నది. రెండు సంవత్సరాల్లో సుమారు 9,278 పోస్టుల భర్తీ చేపట్టింది.
ప్రస్తుతం అన్ని హాస్పిటళ్లలో సరిపడా నర్సింగ్ ఆఫీసర్లు అందుబాటులో ఉన్నారు. కొత్తగా ఏర్పడుతున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లలో త్వరలోనే సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే, కొన్ని హాస్పిటళ్ల అప్‌గ్రేడెషన్ జరుగుతోంది. కొత్తగా రిక్రూట్ అవుతున్న నర్సింగ్ ఆఫీసర్ల సేవలు, ఈ హాస్పిటళ్లలో ఉపయోగించుకోనున్నట్టు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. త్వరలోనే మల్టీ పర్పస్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టుల పోస్టులకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.