దుమ్మురేపిన డికాక్.. రెండోసారి MLC ట్రోఫీ ఎగరేసుకుపోయిన MI న్యూయార్క్

దుమ్మురేపిన డికాక్.. రెండోసారి MLC ట్రోఫీ ఎగరేసుకుపోయిన MI న్యూయార్క్

వాషింగ్టన్: మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025 విజేతగా MI న్యూయార్క్ నిలిచింది. స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్ (77) చెలరేగడంతో జూలై 14న టెక్సాస్‌లోని డల్లాస్‌ గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టును 5 పరుగుల తేడాతో చిత్తు చేసి రెండోసారి టైటిల్ కైవసం చేసుకుంది MI న్యూయార్క్ టీమ్. ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. 

మోనాంక్ పటేల్ (28), క్వింటన్ డి కాక్‌ (77) అదిరిపోయే ఆరంభం అందించారు. చివర్లో MI న్యూయార్క్ కెప్టెన్ నికోలస్ పూరన్ (21), కున్వర్‎జీత్ సింగ్ (22) మెరుపులు మెరిపించారు. వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలర్లలో లూకీ ఫెర్గూసన్ 3 వికెట్లు తీయగా.. నేత్రావల్కర్, ఎడ్వర్డ్స్, మ్యాక్స్‎వెల్, హోలాండ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 181 పరుగుల చేధనకు దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులే చేసి 5 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. 

రచిన్ రవీంద్ర (70), గ్లెన్ ఫిలిఫ్స్ (48), జాక్ ఎడ్వర్డ్స్ (33) రాణించినా.. మిగితా బ్యాటర్లు విఫలం కావడంతో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుకు పరాజయం తప్పలేదు. చివరి ఓవర్లో 12 పరుగులు కావాల్సి ఉండగా.. వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసింది. స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ చివరి ఓవర్ లో ఔట్ కావడంతో వాషింగ్టన్ ఫ్రీడమ్ టీమ్ ఓటమి పాలైంది. ఎంఐ న్యూయార్క్ బౌలర్లలో బౌల్ట్, రుచిల్ ఉగార్కర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. నోస్తుష్ కెంజిగే ఒక వికెట్ తీశాడు.