PSL 2024: ఇంత చెత్తగానా ఆడేది.. జట్టు ఓటమికి కారణమైన బాబర్ ఆజామ్

PSL 2024: ఇంత చెత్తగానా ఆడేది.. జట్టు ఓటమికి కారణమైన బాబర్ ఆజామ్

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తనకు తాను గొప్ప బ్యాటర్ గా నిరూపించుకున్నాడు. ఫార్మాట్ ఏదైనా నిలకడగా రాణించే అతి కొద్ది మందిలో బాబర్ ఒకడు. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ లోనూ అదరగొడుతున్నాడు. అయితే నిన్న జరిగిన కీలక మ్యాచ్ లో తమ జట్టు పరాజయానికి పరోక్షంగా కారణమయ్యాడు. ఇంతకీ బాబర్ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. 

ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. ఇందులో భాగంగా నాకౌట్ మ్యాచ్ లో బాబర్ బ్యాటింగ్ ప్రదర్శన నిరాశకు గురి చేసింది. జట్టు టాప్ స్కోరర్ గా నిలిచినా విమర్శలు తప్పడం లేదు. ఈ లీగ్ లో పెషావర్ జల్మీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న బాబర్ క్వాలిఫైయర్‌1 లో ముల్తాన్ సుల్తాన్‌పై 42 బంతుల్లో 46 పరుగులు చేశాడు. బాబర్ జిడ్డు బ్యాటింగ్ తో స్కోర్ కార్డు అసలు ముందుకు కదలలేదు. రిస్క్ చేసి షాట్స్ ఆడటంతో విఫలమయ్యాడు.
 
ఓపెనర్ గా వచ్చి 14 ఓవర్లో ఔటై జట్టును కష్టాల్లో పడేశాడు. పిచ్ ఎంతలా బౌలర్లకు అనుకూలించిన బాబర్ టీ20 లు అనే సంగతి మర్చిపోయి వన్డే తరహాలో ఆడటం విమర్శకులకు గురి చేస్తుంది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తమ (పెషావర్ జల్మీ) జట్టు 7 వికెట్ల నష్టానికి కేవలం 146 పరుగులకే పరిమితమైంది. ఈ దశలో కామెంటరీ చేస్తున్న ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైకేల్ క్లార్క్ బాబర్ ఔట్ కావడం మంచిదే అన్నాడంటే అతని బ్యాటింగ్ ఎంత నిదానంగా సాగిందో మనం అర్ధం చేసుకోవచ్చు. 

లక్ష్య ఛేదనలో ముల్తాన్ సుల్తాన్‌ మరో 9 బంతులుండగానే ఆడుతూ పాడుతూ ఈజీగా టార్గెట్ ఛేజ్ చేసింది. ఓపెనర్ యాసిర్ ఖాన్ హాఫ్ సెంచరీతో ముల్తాన్ జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. ఓడిపోయినా లీగ్ దశలో టాప్ 2 లో ఉన్న పెషావర్ జల్మీకి ఫైనల్ కు చేరుకోవడానికి మరో అవకాశం ఉంది. ఎలిమినేటర్ 2 లో గ్లాడియేటర్స్ లేదా ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుతో అమీతుమీ తేల్చుకుంటుంది.