
ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఇటీవలే జరిగిన మూడో టెస్టు థ్రిల్లర్ ను తలపించింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ టెస్ట్ అసలైన టెస్ట్ క్రికెట్ మజా చూపించింది. ఇరు జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ టెస్టులో ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో ఇండియాపై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. తొలి నాలుగు రోజులు టీమిండియా ఆధిపత్యం చూపించినా చివరి రోజు ఇంగ్లాండ్ అద్భుతమైన బౌలింగ్ తో సంచలన విజయం విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ ఫుల్ ఖుషీగా ఉంటే ఐసీసీ ఊహించని షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ జట్టుపై 10 శాతం జరిమానా విధించడమే కాదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో రెండు పాయింట్లు కట్ చేసింది.
ఈ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ జట్టుకు మాత్రమే జరిమానా విధించినందుకు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ను బహిరంగంగా విమర్శించాడు. సోషల్ మీడియా ద్వారా ఈ ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ తన నిరాశను వ్యక్తం చేస్తూ.. "నిజాయితీగా చెప్పాలంటే, లార్డ్స్‌లో రెండు జట్ల ఓవర్ రేట్లు చాలా చాలా పేలవంగా ఉన్నాయి. ఒక్క జట్టును ఎలా మందలించారో నాకు అర్థం కాలేదు. న్యాయంగా ఉండటం అత్యంత ముఖ్యమైది. అన్ని జట్లకు క్రికెట్ పాలక మండలి సమాన న్యాయం అందేలా చూడాలి". అని వాన్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో రాసుకొచ్చాడు.
Let’s be honest both teams over rates at Lords were very very poor .. How only 1 team has been reprimanded is beyond me .. #ENGvsIND
— Michael Vaughan (@MichaelVaughan) July 16, 2025
లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఇండియా రెండో ఇన్నింగ్స్ లో 10 నిమిషాల పాట (రెండు ఓవర్లు ఆలస్యం) ఆలస్యం అయినట్టు.. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ నేరానికి పాల్పడినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రూల్స్ లో భాగంగా ఆర్టికల్ 16.11.2 ప్రకారం ఒక జట్టుకు ప్రతి తక్కువ ఓవర్‌కు ఒక పాయింట్ జరిమానా విధించబడుతుంది. ఇంగ్లాండ్ రెండు ఓవర్లు ఆలస్యం వేసిన కారణంగా రెండు పాయింట్లలో కొత్త విధించారు. పాయింట్లు కట్ చేయడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ స్టాండింగ్స్‌లో ఇంగ్లాండ్ 24 నుండి 22కి పడిపోయింది. దీంతో వారి పాయింట్ల శాతం 66.67% నుండి 61.11%కి తగ్గింది.
Also Read:-గిల్ అనవసర దూకుడే ఇంగ్లాండ్ విజయానికి కారణమైంది
ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులకు ఆలౌటైంది. రూట్ (104) సెంచరీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు, బుమ్రా 5 వికెట్లతో రాణించాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో ఇండియా కూడా సరిగ్గా 387 పరుగులు చేసింది. రాహుల్ సెంచరీ చేసి ఇండియాను ఆదుకున్నాడు. భారత బౌలర్లు విజృంభించడంతో రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 192 పరుగులకే ఆలౌట్ అయింది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 170 పరుగులకు ఆలౌట్ అయింది.