- మోదీని కలిశాక ప్రకటించిన కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల
- క్లౌడ్, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కిల్స్ పెంచడం, బిజినెస్ విస్తరణపై ఫోకస్
న్యూఢిల్లీ: అమెరికన్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 2026–2029 మధ్య భారత్‌లో 17.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.57 లక్షల కోట్ల) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. కంపెనీకి ఇది ఆసియాలో అతిపెద్ద పెట్టుబడి. సీఈఓ సత్య నాదెళ్ల ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత ఈ ప్రకటన చేశారు. “భారత్ ఏఐ భవిష్యత్తుకు మైక్రోసాఫ్ట్ 17.5 బిలియన్ డాలర్లు కేటాయిస్తోంది” అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
మోదీ స్పందిస్తూ “ఏఐలో ప్రపంచం భారత్‌పై ఆశావహంగా ఉంది. మైక్రోసాఫ్ట్ ఆసియాలో తమ అతిపెద్ద పెట్టుబడి భారత్‌లో చేయడం సంతోషకరం” అని అన్నారు. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే 3 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించగా, దీనికి తాజా ఇన్వెస్ట్‌మెంట్ అదనం. మొత్తంగా 2025–2030లో 20 బిలియన్ డాలర్ల (రూ.1.80 లక్షల కోట్ల)ను ఇన్వెస్ట్ చేయడానికి మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది.
క్లౌడ్, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కిల్లింగ్, బిజినెస్ విస్తరణ వంటి వాటి కోసం ఈ ఫండ్స్ ఖర్చు చేయనుంది. ఈ కంపెనీకి భారత్‌లో 22 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. హైదరాబాద్‌లో ‘ఇండియా సౌత్ సెంట్రల్ క్లౌడ్ రీజియన్’ ను వచ్చే ఏడాది ప్రారంభిస్తుంది. అదనంగా, ఈశ్రమ్, ఎన్‌సీఎల్ ప్లాట్‌ఫామ్‌లకు ఏఐ సర్వీస్‌లు అందిస్తుంది. 2030 నాటికి 2 కోట్ల మందికి ఏఐ నైపుణ్యాలు అందించాలని కంపెనీ టార్గెట్ పెట్టుకుంది. గతంలో వేసిన టార్గెట్ కంటే ఇది రెండింతలు.
