వాన ఆగలె..వరద తగ్గలె.. ‘మిగ్‌‌జాం’ ఎఫెక్ట్​​ తో చెన్నై విలవిల

వాన ఆగలె..వరద తగ్గలె.. ‘మిగ్‌‌జాం’ ఎఫెక్ట్​​ తో చెన్నై విలవిల
  • నీట మునిగిన కాలనీలు.. నదులను తలపిస్తున్న రోడ్లు
  • ఇప్పటిదాకా 12 మంది మృతి..
  • కరెంటు లేక జనం ఇక్కట్లు..
  • బోట్లలో బాధితుల తరలింపు

చెన్నై: ‘మిగ్‌‌జాం’ తుఫాను ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. ఎడతెరిపిలేని వర్షాలతో సిటీ జనం విలవిల్లాడుతున్నారు. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. చాలా రోడ్లు నదులను తలపిస్తున్నాయి. కరెంటు లేకపోవడం, రవాణా స్తంభించడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోట్లు, ట్రాక్టర్ల ద్వారా వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్షాలు మొదలైనప్పటి నుంచి 12 మంది దాకా చనిపోయారు. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 9 జిల్లాలపై తుఫాన్ ఎఫెక్ట్ చూపగా.. చెన్నైలో తీవ్ర నష్టం వాటిల్లింది. పునరావాస చర్యలు చేపట్టేందుకు రూ.5 వేల కోట్ల సాయం చేయాలని కేంద్రానికి డీఎంకే విజ్ఞప్తి చేసింది.

ఇతర జిల్లాల నుంచి 5 వేల మంది

మంగళవారం ఉదయం చెన్నైలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో.. అధికారులు రెస్క్యూ పనులను వేగవంతం చేశారు. ఇతర జిల్లాల నుంచి 5 వేల మందికి పైగా కార్మికులను గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ తరలించింది. వీళ్లు ట్రాక్టర్లు, బోట్లలో తిరుగుతూ.. రెస్క్యూ చేపడుతున్నారు. రిలీఫ్ మెటీరియల్స్‌‌ను పంపిణీ చేస్తున్నారు. వర్షప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టేందుకు పలు డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్‌‌ టీమ్స్‌‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నీటితో నిండిపోవడంతో 16 సబ్‌‌వేలను మూసేశారు. ముథియల్‌‌పేట్ ఏరియాలో చిక్కుకున్న 54 కుటుంబాలను అక్కడి నుంచి తరలించారు.

కరెంటు లేక.. రవాణా జరగక..

చెన్నైలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు సరఫరా నిలిచిపోయింది. ట్రాన్స్‌‌పోర్టు ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. దీంతో సోషల్ మీడియా వేదికగా తమ గోస చెప్పుకుంటున్నారు. ఇండ్లు మునిగిపోవడంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు కార్లలో బయటికి వచ్చి.. వరదలో చిక్కుకుపోయారు. మంగళవారం ఉదయం పీకల్లోతు నీటిలో కొందరు వ్యక్తులు నీళ్ల క్యాన్లు, నిత్యావసరాలను తీసుకెళ్లడం కొన్ని వీడియోల్లో కనిపించింది. అపార్ట్‌‌మెంట్లలోని పార్కింగ్ ప్లేసులన్నీ నీటితో మునిగిపోయాయి. తుఫానుతో ఎఫెక్ట్ అయిన రాష్ట్రాలను అన్ని రకాలుగా ఆదుకోవాలంటూ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కేంద్రాన్ని కోరారు. తుఫాను వల్ల ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు రాహుల్​ గాంధీ ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.

వరదలో చిక్కుకున్న నటుడు విష్ణు విశాల్.. సాయం కోసం ట్వీట్​

వరద నీటిలో చిక్కుకున్న తమిళ నటుడు విష్ణు విశాల్​ సాయంకోసం ట్వీట్ చేశారు. ‘కారప్పాకంలో నేను ఉంటున్న ఇంట్లోకి వరద చేరింది. కరెంట్, నెట్‌‌ లేదు. ఫోన్‌‌ సిగ్నల్‌‌ సరిగా అందట్లేదు. ఇంటిపై ఓ చోట మాత్రమే సిగ్నల్‌‌ వస్తున్నది. అక్కడ నుంచే ఇది పోస్ట్‌‌ చేస్తున్నా. నాతోపాటు ఈ చుట్టుపక్కల ఉన్న వారికి సాయం అందుతుందని ఆశిస్తున్నా’ అని రాసుకొచ్చారు. ఆయన ట్వీట్ చేసిన కొద్దిసేపటికే రెస్క్యూ టీమ్ స్పందించి.. ఆయన్ను సురక్షితంగా తరలించింది. ఈ విషయాన్ని విష్ణు విశాల్‌‌ మరో పోస్ట్‌‌ ద్వారా తెలియజేశారు. రెస్క్యూ టీమ్‌‌తో బాలీవుడ్‌‌ నటుడు అమీర్‌‌ ఖాన్‌‌ కూడా కనిపించడం గమనార్హం.

61,666 రిలీఫ్ క్యాంపులు పెట్టినం: స్టాలిన్

సహాయక చర్యలను యుద్ధప్రాతిపాదికన చేపడుతున్నామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌‌ (జీసీసీ) కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘వర్షాలకు ప్రభావితమైన 9 జిల్లాల్లో 61,666 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 11 లక్షల ఆహార పొట్లాలు, ఒక లక్ష పాల ప్యాకెట్లను ఇప్పటిదాకా పంపిణీ చేసినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో కంటే మెరుగ్గానే వరద సహాయక చర్యలను చేపడుతున్నామని అన్నారు.