వలస కార్మికులకు వార్ కష్టాలు ! పనులు లేక సొంత రాష్ట్రాలకు తిరుగు పయనం

వలస కార్మికులకు వార్ కష్టాలు ! పనులు లేక సొంత రాష్ట్రాలకు తిరుగు పయనం
  • రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్​ఫుడ్ సెంటర్లు బంద్​
  • కమర్షియల్​ సిలిండర్ల కొరతతో పెరుగుతున్న ఇబ్బందులు

హైదరాబాద్,/నల్గొండ, వెలుగు: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం ప్రతికూల ప్రభావం రాష్ట్రంలోని హోటల్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. కమర్షియల్ ఎల్‌‌పీజీ సిలిండర్లకు 50 శాతానికి పైగా కొరత ఏర్పడడంతో రాష్ట్రవ్యాప్తంగా వందలాది హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌‌ఫుడ్ సెంటర్లు మూతపడుతున్నాయి. 

దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఉపాధి పొందుతున్న వలస కార్మికులు తీవ్ర కష్టాల్లో కూరుకుపోయి, పనులు లేక సొంత రాష్ట్రాలకు పయనమవుతున్నారు. రాష్ట్రంలో లక్షలాది హోటళ్లు, రెస్టారెంట్లు, టీ షాపులు, ఫాస్ట్​ ఫుడ్​ సెంటర్లు, దాబాలు ఉన్నాయి.

వీటిలో సుమారు ఐదు లక్షలకు పైగా మంది స్థానికులతో పాటు బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తున్నారు. ఈ రంగం వారి కుటుంబాల ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారంగా ఉండగా, ప్రస్తుత పరిస్థితులు వారి ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

యుద్ధం ప్రభావంతో గ్యాస్ కొరత..
పశ్చిమాసియాలోని యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా ఎల్‌‌పీజీ సరఫరా తీవ్రంగా దెబ్బతింది. దీని ప్రత్యక్ష ప్రభావం రాష్ట్రంలోని హోటల్ రంగంపై పడింది. కమర్షియల్ సిలిండర్లు దొరక్కపోవడంతో అనేక హోటళ్లు మెనూను తగ్గించుకుని, కట్టెల పొయ్యిలపై బిర్యానీ వంటి పరిమిత వంటలకే కట్టుబడుతున్నాయి.

స్టార్టర్లు, రోటీ, కర్రీలు, గ్రేవీల వంటి అధిక గ్యాస్ వినియోగం అయ్యే వంటకాలను పూర్తిగా నిలిపివేశారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున హోటళ్లు మూతపడ్డాయి. కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్న హోటల్ యజమానులు కూడా కట్టెల కొరత, బ్లాక్ మార్కెట్ ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

మరో వైపు గ్యాస్ కొరత, చికెన్ ధరల పెరుగుదల, చికెన్ సెంటర్ల బంద్-ఈ మూడు సమస్యలు కలిసి హోటల్ వ్యాపారాన్ని తీవ్రంగా కుదిపేస్తున్నాయి. నల్గొండ జిల్లాలో ఇప్పటికే 50 శాతానికి పైగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌‌ఫుడ్ సెంటర్లు మూతపడగా, ఏప్రిల్ 1 నుంచి మరికొన్ని హోటళ్లు బంద్ చేసేందుకు యజమానులు సిద్ధమవుతున్నారు.

వలస కార్మికులపై తీవ్ర ప్రభావం..
హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడటంతో వలస కార్మికుల ఉపాధి తీవ్ర సంక్షోభంలో పడుతోంది. సిబ్బందిని తగ్గించాల్సి వస్తున్నందున చేసేదేమీ లేక పలువురు కార్మికులు సొంత గ్రామాలు, రాష్ట్రాలకు తిరుగుముఖం పడుతున్నారు.

“యుద్ధం ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత విషమిస్తుంది. ఇప్పటికే సగానికి పైగా హోటళ్లు మూతపడ్డాయి. ఏప్రిల్ 1 నుంచి మరిన్ని హోటళ్లు బంద్ చేయాల్సి వస్తుంది” అని హోటల్ యజమానులు, నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వ్యాపారం నష్టాల్లో పడుతుండగా, మరోవైపు కార్మికుల జీవనాధారం పూర్తిగా దెబ్బతింటోంది.  

హోటల్ రంగంపై భారీ దెబ్బ..
హోటల్ రంగం లక్షలాది మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తోంది. ప్రస్తుత సంక్షోభంతో ఈ రంగం తీవ్రంగా దెబ్బతింటోంది.  గ్యాస్ కొరతతో హోటళ్లు మూతపడటంతో చిన్న వ్యాపారాలు, కూలీలు, సరఫరాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఏప్రిల్ నుంచి పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని హోటల్ సంఘాలు, వ్యాపారవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో వలస కార్మికులు మాత్రమే కాకుండా, మొత్తం హోటల్ రంగం సుదీర్ఘకాలిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.