ట్రంప్ శిలాయుగం వ్యాఖ్యలపై చైనా ఫైర్..సైనిక చర్యలతో ఒరిగేదేం లేదంటూ కౌంటర్

ట్రంప్  శిలాయుగం వ్యాఖ్యలపై చైనా ఫైర్..సైనిక చర్యలతో ఒరిగేదేం లేదంటూ కౌంటర్

ఇరాన్‌ను తిరిగి రాతియుగానికి పంపిస్తామంటూ  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలపై చైనా తీవ్రంగా స్పందించింది. యుద్దంతో సమస్యలు పరిష్కారం కావు.. ఏ వర్గానికీ ప్రయోజనం ఉండదు.  సైనిక చర్యలు ఉపసంహరించుకుంటేనే బాగుంటుందని డ్రాగన్ కంట్రీ హితవు పలికింది. 

సైనిక చర్యల తో ఏ సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేం.. ఘర్షణలను పెంచడం వల్ల ఏ వర్గానికీ ప్రయోజనం ఉండదని  చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ గురువారం స్పష్టం చేశారు. "రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్‌పై అత్యంత కఠినంగా దాడి చేస్తాం" అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పశ్చిమాసియాలో మరింత ఆందోళనలు రేకెత్తిస్తున్న క్రమంలో చైనా ఈ మేరకు ప్రతిస్పందించింది.

గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్.. రాబోయే వారాల్లో ఇరాన్ తీవ్రమైన సైనిక చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.  రాబోయే రెండు మూడు వారాల్లో మేము వారిపై అత్యంత కఠినంగా దాడులు చేస్తాం.. ఇరాన్‌ అసలు స్థఆనం రాతియుగానికి పంపుతాం.. ఈలోగా దౌత్యపరమైన చర్చలు కూడా కొనసాగుతాయని  ట్రంప్ హెచ్చరించారు. 

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన సైనిక ఆపరేషన్ల ఫలితంగా టెహ్రాన్‌లో (ఇరాన్ రాజధాని) వాస్తవంగా  పాలనా మార్పు జరిగిందని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  పాలనా మార్పు అనేది మా అధికారిక లక్ష్యం కాదు.. మేమెప్పుడూ ఆ మాట చెప్పలేదు. అయితే వారి ముఖ్య నేతలు చాలామంది చనిపోవడం వల్ల అది వాటంతట అదే జరిగిపోయింది" అని ఆయన వివరించారు. 

తుది దశకు చేరుకున్నాం.. ట్రంప్

నెల రోజులకు పైగా కొనసాగుతున్న యుద్దం ముగించేందుకు ఒకవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ, అమెరికా లక్ష్యాలన్నీ నెరవేరే వరకు సైనిక కార్యకలాపాలు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు.  మా లక్ష్యాలు పూర్తిగా సాధించేవరకు దాడులు కొనసాగిస్తాం.. ఇప్పటివరకు సాధించిన పురోగతిని బట్టి చూస్తే, అతి త్వరలోనే అమెరికా తన లక్ష్యాలన్నింటినీ పూర్తి చేసే దిశగా విజయవంతంగా సాగుతోంది" అని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.