మిలటరీ టాప్ జనరల్​ను తొలగించిన కిమ్

మిలటరీ టాప్  జనరల్​ను తొలగించిన కిమ్
  • యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశం

సియోల్:  తమ దేశ మిలిటరీ టాప్  జనరల్  పాక్  సూయ్ ను నార్త్  కొరియా ప్రెసిడెంట్  కిమ్  జాంగ్ ఉన్  తొలగించారు. ఆయన స్థానంలో జనరల్  రి యోంగ్  గిల్ ను నియమించారు. అలాగే శత్రు దేశాలతో యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ఇందు కోసం ఆయుధ సంపత్తిని మరింత పెంచాలని కిమ్ ఆదేశించారని ఆ దేశ ప్రభుత్వ మీడియా కేసీఎన్ఏ తెలిపింది. అలాగే మిలిటరీ డ్రిల్స్  కూడా పెంచాలని ఆదేశించారని పేర్కొంది. అయితే, శత్రు దేశాల పేర్లను కిమ్  చెప్పలేదని కేసీఎన్ఏ వెల్లడించింది.
 ‘‘సెంట్రల్  మిలిటరీ కమిషన్  సమావేశంలో కిమ్  ఈ వ్యాఖ్యలు చేశారు. నార్త్  కొరియా శత్రువుల చర్యలకు కళ్లెం వేయడంపై ఆ సమావేశంలో చర్చలు జరిపారు. ఆయుధాల ఉత్పత్తి, సామర్థ్యం పెంచడంపైనా కిమ్  లక్ష్యాలు విధించారు. గత వారం ఆయుధాల ఫ్యాక్టరీని ఆయన సందర్శించారు. మరిన్ని మిసైల్  ఇంజిన్లు, ఫిరంగులు, ఇతర ఆయుధాలను తయారు చేయాలని ఆయన ఆదేశించారు” అని కేసీఎన్ఏ వివరించింది.