పాలు చోరీ చేసి నీళ్లు కలిపారు

  పాలు చోరీ చేసి నీళ్లు కలిపారు
  • నలుగురు నిందితులు అరెస్ట్ 
  • రూ. 15 లక్షల సొత్తు స్వాధీనం
  • నిందితులకు రిమాండ్  

శంషాబాద్, వెలుగు:  ఈజీగా మనీ సంపాదించాలనే ఆశతో పాల ట్యాంకర్లలో పాలను చోరీ చేసి వాటి స్థానంలో నీళ్లు కలుపుతున్న ముఠాను శంషాబాద్ జోన్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ పరిధి తొండుపల్లి వైన్స్ వెనక పాలను కల్తీ చేస్తున్నారనే సమాచారం అందడంతో ఆదివారం పోలీసులు దాడులు చేశారు. నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన పాల ట్యాంకర్ కర్నూలు నుంచి నాగపూర్ వైపు వెళ్తోంది.  ఆటో డ్రైవర్ గుండాల వెంకన్న,  జీడిమెట్ల గండి మైసమ్మకు చెందిన ఆటో డ్రైవర్ చెడ్డీలాల్, మరో ఆటో డ్రైవర్ సచిన్, వెహికల్ పైలట్ చేతన్ లతో కలిసి పాలను దొంగిలించారు.  వాటి స్థానంలో ట్యాంకర్ లో నీళ్లను కలుపుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మిల్క్ రిసీవర్ మేడ్చల్ కి చెందిన శేఖర్ పరారీలో ఉన్నాడు.  వీరి నుంచి 9 వేల లీటర్ల పాల మిల్క్ ట్యాంకర్, రెండు ఆటోలు  నీటిని నింపే పైపులు, 30 పాల డబ్బాలు, నీటితో నింపిన 22 పాల డబ్బాలు, 31 ఖాళీ డబ్బాలతో సహా మొత్తం 15 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ ముఠా పాల ట్యాంకర్ లో నుంచి పాలు తీసి వాటిలో నీళ్లు కలిపి సొమ్ము చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుల పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.