మిల్లర్ల కుమ్మక్కు

మిల్లర్ల కుమ్మక్కు
  • క్వింటాల్​కు రూ.200 నుంచి రూ.300 తగ్గింపు 
  • మీటింగ్ లు పెట్టుకొని రేటు ఫిక్స్ చేస్తున్నరు
  • రైతులకు ఎకరాకు రూ.3వేల దాకా నష్టం

మిర్యాలగూడ, వెలుగు: రాష్ట్రంలో కొన్ని చోట్ల రైస్​ మిల్లులకు ధాన్యం రాక మొదలైంది. మరో నెల రోజుల్లో పూర్తిస్థాయిలో యాసంగి పంట చేతికి వచ్చే అవకాశాలు ఉండడంతో మిల్లర్లు ముందుస్తు ప్లాన్​ప్రకారం ధరలు తగ్గిస్తున్నారు. మీటింగ్​లు పెట్టుకుని మరీ వడ్లు క్వింటాల్​కు రూ.200 నుంచి రూ.300 వరకు తగ్గించి కొనాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు రాజకీయంగా మారి డైలమాలో పడడంతో ఈ పరిస్థితిని మిల్లర్లు అవకాశంగా మలుచుకుంటున్నారు. కొద్దిరోజుల్లో భారీ స్థాయిలో వడ్లు మార్కెట్​కు వస్తాయని.. ఇప్పుడు ధరలు తగ్గించకపోతే రైతులు ఇదే రేటు అడుగుతారని ముందే కోత పెడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అటు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో లేదో తెలియక, మిల్లర్లకు అమ్ముదామనుకుంటే నష్టపోతామని ఆవేదన చెందుతున్నారు.

మిర్యాలగూడలో స్టార్ట్
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని రైస్​మిల్లులకు రెండు వారాలుగా హెచ్ఎంటీలు, చింట్లు, ఇతర సన్న రకాల ధాన్యం వస్తోంది. ఈ సీజన్​ ప్రారంభంలో క్వింటాల్ చింట్లకు రూ.2200, హెచ్ఎంటీలకు రూ.2100 ఇచ్చిన మిల్లర్లు ప్రస్తుతం చింట్లకు రూ.1900, హెచ్ఎంటీలకు రూ.1800,  రూ.1850 ఇస్తున్నారు. 
సన్నొడ్లకు మద్దతు ధర రూ.1,960 ఉండగా మొన్నటి వరకు పోటీలు పడి 2 వేల పైచిలుకు ధరకు కొన్నారు. ఒక్కసారిగా హెచ్ఎంటీలకు రూ. 100 చింట్లకు రూ. 200 నుంచి రూ.300 ధర తగ్గించారు. దీంతో సన్న వడ్లు సాగు చేసిన రైతులు ఎకరాకు రూ.2500 నుంచి రూ.3 వేల వరకు నష్టపోనున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని రైస్ మిల్లర్లు వారం కింద ఓ మీటింగ్​పెట్టుకున్నట్టు సమాచారం. అందులో క్వింటాల్​కు రూ.1900 మాత్రమే చెల్లించాలని నిర్ణయించినట్టు తెలిసింది. మిల్లుల నిర్వహణకు వడ్ల స్టాక్​ అవసరముందని భావించిన ఓ వర్గం మిల్లర్లు మద్దతు ధర కంటే ఎక్కువగా ఇచ్చి ధాన్యం కొంటామని చెప్పగా.. ఇప్పుడు ధరలు తగ్గించకపోతే సీజన్ మొత్తం అదే రేటు చెల్లించాలని రైతులు లొల్లి చేస్తారని మరో వర్గం మిల్లర్లు వాదించినట్టు తెలిసింది. అయితే కొంతమంది ప్రజాప్రతినిధులు కలుగజేసుకొని ధర విషయంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై సోషల్​మీడియా ​గ్రూపుల్లో చర్చ నడుస్తున్నది.

సర్కారు కొనాలె
కేంద్రం సాధారణ రకం వరి క్వింటాల్​కు రూ.1940,  గ్రేడ్–ఎ రకానికి రూ.1960 ప్రకటించింది. ఇప్పుడు ప్రభుత్వం ధాన్యం కొనకపోయినట్లయితే రైతులు మిల్లర్లను ఆశ్రయించక తప్పదు. రైస్​మిల్లర్లు ధరలు తగ్గించి కొనాలని నిర్ణయించుకుంటున్న నేపథ్యంలో రైతులు అయోమయంలో పడుతున్నారు. మిల్లర్లను నమ్ముకుంటే కనీస మద్దతు ధర కూడా రాదని, గతంలో మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీల ద్వారా ధాన్యం కొనాలని పట్టుబడుతున్నారు.

రేటు తగ్గించిండ్రు 
మాది మాడ్గులపల్లి మండలం దాచారం. 40 క్వింటాళ్ల చింట్ల రకం ధాన్యం శెట్టిపాలెం పరిధిలోని రైస్​  మిల్లులకు తీసుకువచ్చిన, సీజన్ ప్రారంభంలో చింట్లకు రూ. 2100 నుంచి 2200 చెల్లించిన మిల్లర్లు ఇప్పుడు రూ. 2030 నుంచి రూ.  2060 అడుగుతున్నరు. హెచ్ఎంటీ రకం ధాన్యం ధరలు కూడా తగ్గించిండ్రు. రూ.1850 నుంచి 1900 ఇస్తమంటున్నరు.  
- వీరేందర్​రెడ్డి , రైతు

మునుపటి లెక్కనే ధాన్యం కొనాలే
మునుపటి లెక్కనే కొనుగోలు సెంటర్లు పెట్టి ధాన్యం కొనాలె. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రం ఒక నిర్ణయానికి రావాలె. మిల్లర్లు అడ్డగోలుగా ధర తగ్గించి అడుతుతున్నరు. వారికి అమ్ముకుంటే నష్టపోతం.  - ఒజ్జ శ్రీనివాస్​, పెగడపల్లి, పెద్దపల్లి జిల్లా