వడ్లను అమ్ముకుంటున్న మిల్లర్లు

వడ్లను అమ్ముకుంటున్న మిల్లర్లు
  • రేషన్​ బియ్యం రీసైక్లింగ్​ దందా
  • పట్టించుకోని సివిల్​ సప్లై ఆఫీసర్లు 
  • లక్షలు చేతులు మారుతున్న వైనం 

మంచిర్యాల, వెలుగు:జిల్లాలోని పలువురు మిల్లర్లు ఎప్పటిలాగే సీఎంఆర్ (కస్టమ్​ మిల్లింగ్​ రైస్​) వడ్లను అమ్ముకుంటున్నారు. రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ పెడుతున్నారు. ఐదు రోజుల కిందట జైపూర్ మండలం టేకుమట్లలోని బాలాజీ రైస్​మిల్లు నుంచి వడ్లను తరలిస్తుండగా స్థానికుల సమాచారంతో సివిల్​ సప్లై ఆఫీసర్లు పట్టుకున్నారు. ఆ మిల్లర్ ఇప్పటికే సుమారు పది లారీల వడ్లను పెద్దపల్లి జిల్లాలోని రైస్​మిల్లులకు అమ్ముకున్నట్టు సమాచారం. ఇదే రీతిలో జిల్లాలోని పలువురు మిల్లర్లు వడ్లను పక్కదారి పట్టిస్తున్నారు. అలాంటి మిల్లులపై యాక్షన్​ తీసుకోవాల్సిన సివిల్ సప్లై ఆఫీసర్లు నామమాత్రంగా నోటీసులతో సరిపెడుతున్నారు. ఈ వ్యవహారంలో లక్షలు చేతులు మారుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. 

సీఎంఆర్​ ఇలా...  
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్లను రైస్​మిల్లులకు కేటాయిస్తుంది. మిల్లర్లు ఆ వడ్లను మిల్లింగ్​ చేసి క్వింటాల్​కు 68 కిలోల చొప్పున సీఎంఆర్ ఇవ్వాలి. ఇందుకు గాను ప్రభుత్వం మిల్లర్లకు మిల్లింగ్​చార్జీలు చెల్లిస్తుంది.  జిల్లా వ్యాప్తంగా గత యాసంగి సీజన్​లో 1.10 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి ఆయా మిల్లులకు కేటాయించారు. మిల్లర్లు వడ్లను నిర్ణీత సమయంలో మిల్లింగ్​ చేసి ప్రభుత్వానికి సీఎంఆర్​ అప్పగించాల్సి ఉంది. యాసంగి బియ్యంలో నూక శాతానికి సంబంధించి సమస్య వచ్చింది. ప్రభుత్వం మిల్లర్లకు బోనస్​ ఇస్తామని ప్రకటించినప్పటికీ  ఎంతన్నది ఇంతవరకు తేల్చలేదు. అలాగే కొద్దిరోజులుగా ఎఫ్​సీఐ బియ్యం సేకరణను నిలిపివేసింది. దీంతో పలువురు మిల్లర్లు సీఎంఆర్​ వడ్లను పక్కదారి పట్టిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని రైస్​మిల్లులకు వందల క్వింటాళ్లు అమ్ముకుంటున్నారు.  

మిల్లులపై పర్యవేక్షణ ఏది?  
జిల్లాలో రైస్​మిల్లులపై సివిల్​ సప్లై ఆఫీసర్ల పర్యవేక్షణ కరువైంది. మిల్లుల్లో అనేక అక్రమాలు జరుగుతున్నా ఆఫీసర్లు చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిందటి సీజన్లకు సంబంధించిన వడ్లను సైతం మిల్లర్లు అమ్ముకున్నారు. కొంతమంది వడ్లను మిల్లింగ్​ చేసి బియ్యాన్ని ఓపెన్​ మార్కెట్​కు తరలించారు. గడువు లోపు సీఎంఆర్​ పెట్టకపోవడంతో అనుమానం వచ్చిన ఎఫ్​సీఐ అధికారులు జిల్లాలోని మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు. తమ అక్రమాలు బయటపడుతాయనే భయంతో పలువురు తనిఖీలకు సహకరించలేదు. ధాన్యం బస్తాలను లెక్కించడానికి వీలు లేకుండా నెట్లు కొట్టి కవర్లు కప్పడం చూసి ఎఫ్​సీఐ ఆఫీసర్లు కంగుతిన్నారు. మిల్లర్లకు రాజకీయ అండదండలు ఉండడం, లోపాయికారి ఒప్పందాలతో సివిల్​ సప్లై ఆఫీసర్లు అటువైపు చూడడం లేదన్న విమర్శలున్నాయి.

నోటీసులతో సరి... చర్యలేవి?  
జైపూర్​ మండలం టేకుమట్లలోని బాలాజీ రైస్​మిల్లు నుంచి వడ్లను పెద్దపల్లి జిల్లాకు తరలిస్తుండగా స్థానికులు సివిల్​ సప్లై ఆఫీసర్లకు సమాచారం అందించారు. వడ్ల లారీని రాజీవ్​ హైవేపై పట్టుకొని నస్పూర్ లోని ఎంఎల్​ఎస్ పాయింట్​కు తరలించారు. వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలంటూ మిల్లర్​కు నోటీసులు జారీ చేశారు. వడ్లను తరలిస్తూ రెడ్​హ్యాండెడ్​గా దొరికినప్పటికీ మిల్లర్ పై  యాక్షన్ తీసుకోకుండా అక్రమాలను సరిచేసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లయ్యింది. అధికారులు వెంటనే మిల్లును తనిఖీ చేస్తే అక్రమాలు బయటపడేవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ మిల్లు నుంచి సుమారు పది లారీల వడ్లు పెద్దపల్లి జిల్లాకు తరలిపోయినట్టు సమాచారం. ఇంకా చాలా మిల్లుల్లో ఉండాల్సిన వడ్ల కంటే తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రేషన్​ బియ్యం రీసైక్లింగ్​... 
పలువురు మిల్లర్లు వడ్లను మిల్లింగ్​ చేసి ఓపెన్​ మార్కెట్​లో కిలో బియ్యం రూ.30కి అమ్ముకుంటున్నారు. మరికొందరు ఏకంగా వడ్లనే పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వం పీడీఎస్​ ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్న బియ్యాన్ని డీలర్లు, దళారుల దగ్గర కిలో రూ.20కి కొంటున్నారు. వీటికే పాలిష్​ చేసి సీఎంఆర్​ పెడుతున్నారు. బియ్యం నాణ్యత విషయంలో ఎఫ్​సీఐ స్ట్రిక్ట్​గా వ్యవహరిస్తుండడంతో మిల్లర్ల ఎత్తులు పారడం లేదు. దీంతో సివిల్​ సప్లై ఆఫీసర్లతో కుమ్మక్కు అయి మళ్లీ పీడీఎస్​ కోసం అప్పగిస్తున్నారు. తద్వారా మిల్లర్లు కిలోకు రూ.10 చొప్పున లాభపడుతున్నారు. జిల్లాలోని గుడిపల్లి, టేకుమట్ల, ఇందారం, హాజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి ప్రాంతాల్లోని మిల్లుల్లో రీసైక్లింగ్ దందా జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది.