అక్కడ కష్టాలెలా ఉన్నా.. ఇక్కడి రైతులకు కేసీఆర్ ఉన్నాడన్న నమ్మకముంది

అక్కడ కష్టాలెలా ఉన్నా.. ఇక్కడి రైతులకు కేసీఆర్ ఉన్నాడన్న నమ్మకముంది

హైదరాబాద్:  తెలంగాణ వచ్చిన తరువాత రాష్ట్రంలోని రైతుల‌ కష్టాలు తీరాయని, సాగునీటి కోసం 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధ‌వారం జిల్లాలోని ఇలందకుంట మండలం మల్యాలలో రైతు వేదికను ప్రారంభించి రైతులకు అంకితం చేశారు మంత్రి.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా దాని వెనుక కన్నీళ్లు, బాధలకు పరిష్కారం చెప్పే ఆలోచన ఉంటుంద‌ని అన్నారు. రైతు బంధు, రైతు భీమా అందులోనుంచే వచ్చాయన్నారు. తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనే స్తోమత మిల్లర్ల  దగ్గర లేదన్నారు. ఐకేపీ సెంటర్స్ తోనే అది సాధ్యం అవుతుందని, ఐకేపీ సెంటర్‌లో వడ్లు కొంటేనే మహిళలకు ఉపాధి దొరుకుతుందని చెప్పారు. రైతులు ఇప్పుడిప్పుడే అన్నం తింటున్నారని తెలిపారు. ఎమ్మెస్పీ ప్రకారం ధాన్యం కొనాల్సిందేనని ఆయ‌న స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగం కూడా డిల్లీ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. కానీ అక్కడ రైతుల కష్టాలు ఎలా ఉన్నా మన రాష్ట్రం లో మాకు ఏమీ కాదు అనే నమ్మకం రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఉందని అన్నారు.