Health Alert : టైప్ 5 డయాబెటిక్.. మీరు కొత్తగా వినొచ్చు.. కానీ ఇప్పటికే 2 కోట్ల మందికి ఎటాక్ అయ్యింది.. టైప్ 2 షుగర్ ఎవరికి వస్తుంది..?

 Health Alert : టైప్ 5 డయాబెటిక్.. మీరు కొత్తగా వినొచ్చు.. కానీ ఇప్పటికే 2 కోట్ల మందికి ఎటాక్ అయ్యింది.. టైప్ 2 షుగర్ ఎవరికి వస్తుంది..?

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల మంది ప్రజలకు ఇప్పుడు ఒక కొత్త రకం డయాబెటిస్ ఉందనే అనుమానం వ్యక్తమవుతోంది. దీనిని నిపుణులు టైప్ 5 డయాబెటిస్ అని పిలుస్తున్నారు. ఈ వ్యాధి గురించి ఇప్పటికీ పూర్తిగా పరిశోధనలు జరగలేదు, అందుకే దీనిని చాల తక్కువగా గుర్తించారు. ఈ డయాబెటిస్‌ను సరిగ్గా బయటపడకపోవడం వల్ల సమయానికి చికిత్స అందకపోవచ్చు.

 సాధారణంగా కనిపించే టైప్ 2 డయాబెటిస్ స్థూలకాయంతో అంటే బరువు ఎక్కువగా ఉండటంపై ముడిపడి ఉంటుంది. కానీ టైప్ 5 డయాబెటిస్ మాత్రం సన్నగా, బరువు తక్కువగా ఉన్నవారిలో వస్తుంది. ముఖ్యంగా చిన్నతనంలో పోషకాహార లోపంతో బాధపడినవారిని  ప్రభావం చేస్తుంది. పోషకాహార లోపం (Malnutrition) అంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు, శక్తి లభించకపోవడం. దీనివల్ల బరువు తక్కువగా ఉండటం, ఎదుగుదల లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.

లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించిన ఒక రిపోర్ట్  ప్రకారం భారతదేశం వంటి తక్కువ, మధ్య ఆదాయం దేశాల్లో 30 ఏళ్ల లోపు యువకులలో ఈ రకం డయాబెటిస్ ఎక్కువగా కనిపిస్తుంది.

టైప్ 5 డయాబెటిస్ లక్షణాలు: ఎక్కువగా దాహం వేయడం, తరచుగా మూత్రానికి వెళ్లడం, తీవ్రమైన తలనొప్పి, కళ్లు మసకవ్వడం, ఎప్పుడు అలసటగా, నీరసంగా ఉండటం ఇంకా గాయాలు, పుండ్లు త్వరగా మానకపోవడం....  ఈ వ్యాధి ఉన్న చాలామంది బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి పోషకాహార లోపం లక్షణాలతో ఉంటారు. అందువల్ల, ఈ పరిస్థితిని గుర్తించడం కాస్త కష్టంగా మారుతుంది.

టైప్ 5 డయాబెటిస్ ఎందుకు వస్తుంది: ఈ వ్యాధిపై పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే, పోషకాహార లోపం వల్ల క్లోమం (pancreas) పూర్తిగా ఎదగకుండా ఆగిపోయినప్పుడు టైప్ 5 డయాబెటిస్ వస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. క్లోమం అనేది మన రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే ఇన్సులిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేసే అవయవం. చిన్నతనంలో లేదా గర్భంలో ఉన్నప్పుడు పోషకాహార లోపం ఎదురైతే, అది క్లోమం పనితీరుపై ప్రభావం చూపొచ్చు

 టైప్ 5 డయాబెటిస్‌ గుర్తించడానికి డాక్టర్ మొదట రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పరీక్ష చేస్తారు. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారికి గ్లూకోజ్ స్థాయి 200 mg/dL కన్నా ఎక్కువగా ఉంటుంది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో A1C, యూరినాలిసిస్ వంటి మరికొన్ని పరీక్షలు కూడా చేస్తారు. కానీ తక్కువ ఆదాయం, మధ్య ఆదాయం ఉన్న దేశాల్లో ఈ పరీక్షలు అందుబాటులో ఉండకపోవడం వల్ల టైప్ 5 డయాబెటిస్ ఎక్కువగా తప్పుగా నిర్ధారణ అవుతుంది.  ఈ వ్యాధికి ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే, రోగ నిర్ధారణ సమయంలో ఈ రోగుల మూత్రంలో కీటోన్లు (ketones) ఉండవు.