పాస్ బుక్స్ కోసం లక్షల మంది ఎదురుచూపులు 

పాస్ బుక్స్ కోసం లక్షల మంది ఎదురుచూపులు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం, రికార్డుల్లో నమోదైన తప్పుల కారణంగా లక్షలాది మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా శాఖల మధ్య సరిహద్దు వివాదాలు తేలకపోవడంతో 6.60 లక్షల ఎకరాల భూమిని పార్ట్ బీలో చేర్చారు. ఇన్ని రోజులు ఆ భూముల్లో సాగు చేసుకున్న రైతులు.. ఇప్పుడు పాస్ బుక్స్ రాక ఎదురుచూస్తున్నారు. ఫారెస్ట్, రెవెన్యూ మధ్య.. వక్ఫ్, రెవెన్యూ మధ్య వివాదాల కారణంగా దాదాపు 3.50 లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ భూమి మాదంటే.. మాదంటూ ఆయా శాఖల అధికారులు వాదిస్తున్నారే తప్ప.. జాయింట్ సర్వే చేసి బౌండరీలు తేల్చడం లేదు. గ్రామాల్లో రైతులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలపై రిపోర్ట్ పంపాలని రెండ్రోజుల క్రితం ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించడంతో.. ఇప్పటికైనా తమ సమస్య పరిష్కారమవుతుందేమోనని బాధితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 

ప్రక్షాళన టైమ్ లో పాస్ బుక్స్ ఇయ్యలే... 

రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ భూములను ఆనుకొని రెవెన్యూ భూములు ఉన్న ప్రాంతాల్లో దశాబ్దాలుగా సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఈ వివాదాలున్న భూములకు ఉమ్మడి ఏపీలో పాసుబుక్స్ జారీ అయినప్పటికీ.. తెలంగాణ వచ్చిన తర్వాత చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనలో ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అభ్యంతరాల వల్ల కొత్తపాస్ బుక్స్ జారీ కాలేదు. రైతులు సాగు చేసుకుంటున్న 6,40,623 లక్షల ఎకరాల భూములను పార్ట్ బీలో చేర్చారు. ఈ భూములు ఎక్కువగా మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉన్నాయి. పాస్ బుక్స్ లేకపోవడంతో రైతు బంధు రావడం లేదని, బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. పండించిన పంటను కూడా మార్కెట్​లో అమ్ముకోలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇక వక్ఫ్ భూములను ఆనుకొని రెవెన్యూ భూములు ఉన్న ప్రాంతాల్లోనూ వివాదాలు ఉన్నాయి. 19,584 ఎకరాలను పార్ట్ బీలో చేర్చారు. వీటిలో చాలా భూములకు గతంలో పట్టాదారు పాస్ బుక్స్ జారీ చేసినప్పటికీ, భూరికార్డుల ప్రక్షాళన సమయంలో కొత్త పాస్ బుక్స్ నిలిపివేశారు.

ఊరు భూములన్నీ ఫారెస్టులో కలిపిన్రు.. 

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో 1,827 ఎకరాల వ్యవసాయ భూమిని ఫారెస్ట్ భూముల జాబితాలో కలిపేశారు. అంతేగాక ధరణి పోర్టల్ లో ఈ గ్రామానికి చెందిన సర్వే నంబర్లు 149, 150, 154, 165, 166, 168, 200, 201, 202 203, 205ను పక్కనే ఉండే నెల్లికుదురు మండలం చిన్నముప్పారం గ్రామంలో ఉన్నట్లు చూపారు. వాస్తవానికి ఈ భూములను 1952లోనే అప్పటి  రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ నుంచి తీసుకొని రైతులకు పంపిణీ చేసింది. వారికి పట్టాదారు పాస్ బుక్స్ కూడా జారీ అయ్యాయి. కానీ అధికారులు చేసిన తప్పిదానికి గ్రామంలో ఉన్న వందలాది మంది రైతులంతా అరిగోస పడుతున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం రాచకొండ రెవెన్యూ విలేజ్ పరిధిలోని 273, 192 సర్వే నంబర్లలో సుమారు 10 వేల ఎకరాల భూమి ఉంది. ఈ రెండు సర్వే నంబర్లలో అటవీ శాఖకు సుమారు 7,500 ఎకరాలు ఉంది. ఇది పోనూ మిగతా 2,500 ఎకరాలు రెవెన్యూ శాఖ పరిధిలో ఉంది. ఈ భూములకు టీడీపీ, కాంగ్రెస్  ప్రభుత్వాల హయాంలో దఫదఫాలుగా 800 మంది రైతులకు పట్టాలు ఇచ్చారు. అయితే 2017లో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన టైమ్ లో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ భూములకు కొత్త పాస్ బుక్స్ ఇవ్వకుండా పార్ట్ బీలో చేర్చారు. కానీ ధరణిలో 800 మంది రైతుల పేర్లు, వారికి ఇచ్చిన లావణీ పట్టా వివరాలు కనిపిస్తున్నాయి. మూడేండ్లుగా కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా పాస్ బుక్స్ ఇస్తలేరు.

వక్ఫ్ భూమిగా నమోదైన జాగీర్ భూమి 

ఖానాపురం మండలంలోని మంగళవారిపేట, కొడ్తిమాటు, భద్రు, వేపచెట్టు, నాజీ, బోటుమీద తండాల పరిధిలోని సర్వే నంబర్ 22/19లో  1,320.30 ఎకరాల భూమి ఉంది. 1 నుంచి 106 సర్వే నంబర్లలో మరో 500 ఎకరాలు ఉంది. ఈ భూమిని గత 30 ఏండ్ల నుంచి రైతులు సాగు చేసుకుంటున్నారు. నాలుగేండ్ల కిందటి వరకు రికార్డుల్లో పట్టాదారు కాలంలో జాగీర్ అని ఉండగా, అనుభవదారు కాలంలో సాగు చేసుకుంటున్న సుమారు 1,100 మంది  రైతుల పేర్లు ఉండేవి. అప్పట్లో పహాణీపై లోన్లు, ఐటీడీఏ నుంచి ఇతర సబ్సిడీ లోన్లను రైతులు తీసుకున్నారు. భూరికార్డుల ప్రక్షాళనలో అనుభవదార్ల పేర్లను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ భూమిని పూర్తిగా వక్ఫ్ భూమిగా రికార్డుల్లో నమోదు చేశారు. బాధితులు సీఎస్, కలెక్టర్ ను కలిసినా ఫలితం లేకుండా పోయింది.