SA vs ZIM: రికార్డ్ వదిలేసి మనసులు గెలుచుకున్నాడు.. 367 పరుగులతో ముల్డర్ బ్రేక్ చేసిన రికార్డులివే

SA vs ZIM: రికార్డ్ వదిలేసి మనసులు గెలుచుకున్నాడు.. 367 పరుగులతో ముల్డర్ బ్రేక్ చేసిన రికార్డులివే

సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్డర్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచిపోయాడు. టెస్టుల్లో లారా సాధించిన 400 పరుగుల వ్యక్తిగత స్కోర్ ను బ్రేక్ చేసేందుకు సువర్ణావకాశం లభించినా వదులుకున్నాడు. బులవాయో వేదికగా  క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు 367 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లంచ్ కు వెళ్ళాడు. లంచ్ తర్వాత రెండో సెషన్ లో ఈ సఫారీ కెప్టెన్ లారా రికార్డ్ బ్రేక్ చేస్తాడని క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చేశారు. అయితే రెండో సెషన్ కు 5 నిమిషాల ముందు బిగ్ షాక్ . సౌతాఫ్రికా తమ తొలి ఇన్నిన్స్ లో 5 వికెట్లకు 626 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 

ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా కెప్టెన్ ముల్డర్ కావడం విశేషం. కెప్టెన్ గా ముల్డర్ జట్టు విజయం తీసుకున్న ఈ నిర్ణయం అందరి మనసులను గెలుచుకుంది. లంచ్ తర్వాత 5-10 ఓవర్లు సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసినా లారా రికార్డ్ ను ముల్డర్ బ్రేక్ చేసేవాడు. అయితే 34 పరుగుల దూరంలో ప్రపంచ రికార్డ్ ఉన్నప్పటికీ తాను నిస్వార్ధంగా జట్టు కోసం ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. దీంతో 367 పరుగులతో ముల్డర్ నాటౌట్ గా తన ఇన్నింగ్స్ ను ముగించాడు. దీంతో లారా రికార్డ్ పదిలంగా మిగిలింది. ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా ముల్డర్ 334 బంతుల్లో 44 ఫోర్లు, 4 సిక్సర్లతో 367 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. లారా రికార్డ్ బ్రేక్ చేయకపోయినా టెస్టుల్లో ముల్డర్ బ్రేక్ చేసిన రికార్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 

*విదేశాల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్ గా ముల్డర్ నిలిచాడు. అంతకముందు ఈ రికార్డ్ ఇంగ్లాండ్ పాకిస్థాన్ బ్యాటర్ హనీఫ్ మహమ్మద్ పేరిట ఉంది. 1958లో హనీఫ్ వెస్టిండీస్ పై 337 పరుగులు చేసి టాప్ లో   ఉండగా.. తాజాగా ముల్డర్ ఈ రికార్డ్ బ్రేక్ చేసి అగ్ర స్థానంలో నిలిచాడు. 

►ALSO READ | IND VS ENG 2025: మాటతో కాదు ఆటతోనే సమాధానమిచ్చాడు.. గిల్ దెబ్బకు ఇంగ్లాండ్ జర్నలిస్ట్ మాయం

*టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాళ్లలో ఐదో స్థానంలో ముల్డర్ నిలిచాడు. లారా 400 పరుగులతో టాప్ లో ఉన్నాడు. 2003 లో ఇంగ్లాండ్ పై లారా 400 పరుగుల మార్క్ అందుకోవడం విశేషం. ఆస్ట్రేలియా     మాజీ ఓపెనర్ హైడెన్ 380 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 375 పరుగులతో లారా.. 374 పరుగులతో జయవర్ధనే వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.

*297 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ మార్క్ అందుకున్న ఈ సఫారీ ఆల్ రౌండర్ సౌతాఫ్రికా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా  రికార్డులకెక్కాడు. మాజీ సౌతాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా సౌతాఫ్రికా   తరపున ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్ గా నిలిచాడు. 

*టీమిండియా మాజీ బ్యాటర్ సెహ్వాగ్ తర్వాత సెకండ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా ముల్డర్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2008లో సౌతాఫ్రికాపై చెన్నై టెస్టులో సెహ్వాగ్ 278 బంతుల్లో ట్రిపుల్     సెంచరీ సాధించగా.. 297 బంతుల్లో ముల్డర్ 300 మార్క్ అందుకొని రెండో స్థానంలో నిలిచాడు. 

*టెస్టుల్లో సౌతాఫ్రికా తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన కెప్టెన్ గా ముల్డర్ నిలిచాడు. మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 277 పరుగులు చేస్తే ముల్డర్ 367 పరుగులతో దాటేశాడు. 

*టెస్టుల్లో సౌతాఫ్రికా తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ప్లేయర్ గా ముల్డర్ నిలిచాడు. హషీమ్ ఆమ్లా 313 పరుగుల వ్యక్తిగత స్కోర్ ను ముల్డర్ దాటేశాడు.