రేషన్ కార్డుల కోసం ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలి!

రేషన్ కార్డుల  కోసం ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలి!

హైదరాబాద్​, వెలుగు : కొత్త రేషన్​ కార్డుల (ఫుడ్​సెక్యూరిటీ) కోసం రాష్ట్రంలో లక్షల మంది అర్హులు ఎదురు చూస్తున్నారు. కొంతమంది పెండ్లిండ్లు కావడం, కుటుంబాలు వేరు పడటంతో సెపరేట్ కార్డుల కోసం వెయిట్​చేస్తుండగా, మరికొంత మంది అసలు కార్డులే లేక సర్కార్​ఎప్పుడు ఇస్తుందా అని చూస్తున్నారు. రేషన్​కార్డులను ఇష్టారీతిన తొలగించడంపై కొన్ని రోజుల కింద సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దాదాపు 22 లక్షల కార్డులు ఎలా తొలగించారని ప్రశ్నించింది. రద్దు చేసిన కార్డులను వెరిఫై చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అర్హులు తమకు అప్లికేషన్​పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.  

సర్కార్​ఎప్పుడనుకుంటే అప్పుడే

గతంలో రేషన్​కార్డుల జారీ నిరంతరంగా కొనసాగేది. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం అనుకున్నప్పుడే అప్లికేషన్లు తీసుకుంటోంది. ఎవరైనా కొత్తగా ఆప్లై చేసుకుందామని వెళ్తే  సర్కార్​లాక్​ చేసిందనే సమాధానం వస్తోంది.  2018 లో ముందస్తు ఎలక్షన్స్​ఉండటంతో 1.65  లక్షల కార్డులు ఇచ్చారు. కరోనా నేపథ్యంలో పోయిన ఏడాది కొత్త కార్డులు మంజూరు  చేసినా, అందులో పెండింగ్​లో ఉన్న అప్లికేషన్లనే అప్రూవ్​ చేశారు. 2019లో దాదాపు 7లక్షలకు పైగా అప్లికేషన్లు వస్తే.. 3.09 లక్షల కార్డులకే అప్రూవల్​ఇచ్చారు. అంతకు ముందు 2020 సంవత్సరంలో అయితే కేవలం 11 కార్డులే ఇచ్చారు. అయినా ఇంకా 6 నుంచి 8 లక్షల మంది కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.  

వేరు పడ్డవాళ్లే ఎక్కువ

ప్రస్తుతం రాష్ట్రంలో 2.87 కోట్ల మందికి 90,49,480 రేషన్​కార్డులున్నాయి. కాగా, అసలు రేషన్​కార్డు లేని కుటుంబాలు కొంత వరకే ఉండగా, పెండ్లిండ్లు అయి, కుటుంబాలు వేరుగా మారి రేషన్​కార్డులు వేరుగా ఉండాలని కోరుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగానే ఉంటోందని ఆఫీసర్లు చెప్తున్నారు. వీరంతా తహసీల్దార్​ఆఫీసులు, డిస్ర్టిక్ట్​ సివిల్​సప్లయ్​ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అలాగే రేషన్​కార్డుల్లో పిల్లల పేర్లను కూడా నమోదు చేయించుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని మరికొందరు అంటున్నారు.

రేషన్​ షాపులపైనా నాన్చుతున్నరు 

రాష్ట్రంలో 90.50 లక్షల కార్డులు ఉంటే రేషన్ షాపులు మాత్రం 17,012 ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన గైడ్​లైన్స్ ప్రకారం గ్రామాల్లో 500 కార్డులకు ఒక రేషన్ షాపు ఏర్పాటు చేయాలి. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు 600 నుంచి 800 కార్డులకు, ఇతర కార్పొరేషన్లలో 800 నుంచి 1000 కార్డులకు, జీహెచ్ఎంసీ ఏరియాలో 1000 నుంచి 1200 కార్డులకు ఒక రేషన్​ షాపును అందుబాటులో ఉంచాలి. కానీ, చాలా ప్రాంతాల్లో దీనికి అనుగుణంగా దుకాణాలు లేవు. కమిషన్​సరిపోతలేదన్న కారణంతో దాదాపు 5 వేల షాపులు రెగ్యులర్​గా నడపడం లేదని ఆఫీసర్లు చెప్తున్నారు. దీంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఐదు వందల కార్డులకు ఒక రేషన్ షాపు నిబంధనను సవరిస్తే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నాలుగు వేల షాపులు ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని దాదాపు 3,700 తండాలు పంచాయతీలుగా మారాయి. అయితే అక్కడ కూడా కొత్త రేషన్​ షాపులు మాత్రం మంజూరు కాలేదు.

రెండున్నరేండ్లుగా చూస్తున్నా...

నాకు పెండ్లయి రెండున్నరేండ్లవుతోంది. కుటుంబం నుంచి వేరు పడ్డా. కొత్త రేషన్​ కార్డు కోసం అప్లై చేసుకుందామంటే అప్లికేషన్​ తీసుకోవడం లేదు. దీంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆఫీసర్ల దగ్గరకు పోతే లాక్​ ఉందని, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అవకాశం కల్పించాలి.
– మల్లెల నాగారాజు, కామారెడ్డి జిల్లా

ఆరేండ్లుగా రేషన్​ కార్డు లేదు

నాకు, నా ఫ్యామిలీకి ఆరేండ్లుగా రేషన్​ కార్డు లేదు. రెండేండ్ల కిందట అప్లై చేసుకున్నా కార్డు రాలేదు. నా కుటుంబంలో మొత్తం ఐదుగురం ఉంటున్నాం. వేరే ఎక్కడైనా దేని కోసమైనా అప్లై చేసుకుందామంటే రేషన్​ కార్డు తప్పనిసరి అని అంటున్నారు. ఆఫీసర్లను అడిగితే ఎప్పుడిస్తరో తెల్వదు అంటున్నరు. రేషన్​ కార్డు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. 
– షైక్​ అహ్మద్​, జహీరాబాద్