కోట్లాది మంది హాయిగా నిద్రిస్తున్నరంటే పెగాసస్‌‌ పుణ్యమే!

కోట్లాది మంది హాయిగా నిద్రిస్తున్నరంటే పెగాసస్‌‌ పుణ్యమే!
  • ఇజ్రాయెల్‌‌‌‌ కంపెనీ ఎన్‌‌ఎస్‌‌వో వివరణ

జెరూసలెం/వాషింగ్టన్​: ఓ పక్క పెగాసస్​ అంశం ప్రపంచాన్ని కుదిపేస్తుంటే.. దాన్ని తయారు చేసిన సంస్థ ఎన్​ఎస్​వో గ్రూప్​ మాత్రం అది సూపర్​ అంటూ వింత వాదన చేస్తోంది. తమ స్పైవేర్​ వల్ల ప్రపంచంలోని కోట్లాది మంది హాయిగా నిద్రపోతున్నారని కామెంట్​ చేసింది. ఇలాంటి టెక్నాలజీల వల్లే రోడ్ల మీద జనం భయం లేకుండా ధైర్యంగా తిరగగలుగుతున్నారని పేర్కొంది. తన క్లయింట్ల వద్ద ఉన్న సమాచారాన్ని తాము తీసుకోవట్లేదని స్పష్టం చేసింది. అందుకు పెగాసస్​కు థ్యాంక్స్​ చెప్పాలని పేర్కొంది. నిఘా, దర్యాప్తు సంస్థలు పెగాసస్​తో టెర్రరిజం, నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నాయని చెప్పింది. కట్టుదిట్టమైన ఎన్​క్రిప్షన్​ ఉన్న ఫోన్ల మాటున దాక్కున్న వాటన్నింటినీ పెగాసస్​ పటాపంచలు చేస్తోందని తెలిపింది. చీకటి సామ్రాజ్యంలోని అక్రమ వ్యవహారాలపై నిఘా వేసేందుకు ఎలాంటి సాధనాలు లేవని, ప్రపంచంలోని ఇతర సైబర్​ ఇంటెలిజెన్స్​ సంస్థలతో కలిసి ఎన్​ఎస్​వో ఆ టూల్స్​ను తయారు చేసిందని చెప్పుకొచ్చింది. భద్రమైన ప్రపంచం కోసం తాము పనిచేస్తున్నామని వివరించింది. స్పైవేర్​ను దుర్వినియోగం చేస్తున్నారని తెలిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎన్​ఎస్​వో స్పష్టం చేసింది. భద్రతా కారణాల వల్ల తమ క్లయింట్లు ఎవరు? ఎవరిపై నిఘా పెట్టారన్న వివరాలను బయటకు వెల్లడించలేమని తేల్చి చెప్పింది. ఇండియాలో పౌర సంఘాలు, ప్రభుత్వ విమర్శకులు, జర్నలిస్టులు, ప్రతిపక్షాలపై పెగాసస్​తో నిఘా పెట్టడం ఆందోళన కలిగించేదేనని అమెరికా వ్యాఖ్యానించింది. అక్రమంగా నిఘా పెట్టడం దారుణమని సౌత్​, సెంట్రల్​ ఆసియా అఫైర్స్​ శాఖ ఇన్​చార్జ్​ సహాయ మంత్రి డీన్​ థాంప్సన్​ అన్నారు.