కరోనా సెకండ్ వేవ్..దడ పుట్టిస్తున్న ఫీవర్ సర్వే

కరోనా సెకండ్ వేవ్..దడ పుట్టిస్తున్న ఫీవర్ సర్వే
  • రాష్ట్రంలో చాలా మందికి  ఫీవర్‌‌, దగ్గు, జలుబు
  • గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌లో 31 వేల మందికి సింప్టమ్స్‌‌
  • జిల్లాల్లోనూ మస్తు కేసులు
  • కరోనా ఉందో లేదో తెలియక బాధితుల ఆందోళన
  • అందరికీ అందని ఐసోలేషన్‌‌ కిట్లు

వెలుగు, నెట్‌‌వర్క్: కరోనా పేషెంట్లను గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఫీవర్ సర్వే దడ పుట్టిస్తోంది. నాలుగైదు రోజుల కిందట సర్వే స్టార్ట్‌‌ చేయగా గ్రేటర్ హైదరాబాద్ సహా జిల్లాల్లో ఇప్పటికే లక్షలాది మందికి జ్వరం, ఇతర కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌‌లోనే 31 వేల మందికి పైగా జ్వరంతో పాటు ఇతర కరోనా లక్షణాలతో సఫర్ అవుతున్నట్లు తేలింది. జిల్లాల్లోనూ లక్షణాలున్న వాళ్లు ఎక్కువగానే బయటపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10 వేల మందికి పైగా కరోనా సింప్టమ్స్‌‌తో ఇబ్బంది పడుతున్నట్టు వెల్లడైంది. లక్షణాలు ఎక్కువున్న వారికి యాంటిజెన్ టెస్టులు చేస్తామని ఆఫీసర్లు చెబుతున్నా ఎక్కడా చేయట్లేదు. 14 రోజులు హోం క్వారంటైన్‌‌లో ఉండాలని చెబుతున్నారు. దీంతో తమకు కరోనా ఉందో లేదో తెలియక, ఫ్యామిలీ మెంబర్స్‌‌కు దూరంగా ఉండాలో లేదో అర్థం కాక చాలా మంది ఆందోళన చెందుతున్నారు. లక్షణాలున్న అందరికీ ఐసోలేషన్‌‌ కిట్లు ఇస్తామన్న ఆఫీసర్లు కొందరికే ఇస్తుండటంతో మిగిలినవాళ్లు మెడికల్ షాపులకు పరుగుపెడుతున్నారు. 

ఒక్కో టీమ్‌‌.. వెయ్యి మందికి చెకింగ్

కరోనా లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చే వారికి టెస్టులు చేయలేక చేతులెత్తేసిన సర్కారు ఈ నెల 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే స్టార్ట్‌‌ చేసింది. ఆశా కార్యకర్త, అంగన్‌‌వాడీ టీచర్, ఏ‌‌ఎన్‌‌ఎం, మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ నుంచి ఒకరు ఉండేలా నలుగురితో టీమ్‌‌లను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కో టీమ్ వెయ్యి మందిని సర్వే చేయాలని ఆదేశాలిచ్చారు. వీళ్లు ఇంటింటికీ వెళ్లి ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ కండీషన్ తెలుసుకుంటున్నారు. థర్మల్ స్కానర్‌‌తో టెంపరేచర్, ఆక్సీమీటర్‌‌తో పల్స్ చెక్ చేస్తున్నారు. ఈ సర్వే ద్వారా ప్రతి జిల్లాలో వేల మందికి ఫీవర్, దగ్గు, జలుబు, కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. 

గ్రేటర్ హైదరాబాద్‌‌లో 10 ఇండ్లకు ఒకరు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి 10 ఇండ్లకు ఒక కరోనా బాధితుడు ఉన్నట్లు ఫీవర్ సర్వేలో బయటపడుతోంది. 100 ఇండ్లను సర్వే చేస్తే 10 మందికి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. జీహెచ్‌‌ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 3,26,239 ఇండ్లను సర్వే చేశారు. ఇందులో 31 వేల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. 22 వేల మందికి ఫీవర్ ఉన్నట్లు.. 9 వేల మందికి దగ్గు, జలుబు, విరేచనాలు ఉన్నట్లు చెబుతున్నారు. వీళ్లలో అవసరమున్న వాళ్లకు హోమ్ ఐసోలేషన్ కిట్లు అందించారు. కొందరిలో వందకుపైగా టెంపరేచర్ ఉందని హెల్త్ స్టాఫ్ చెబుతున్నారు.

జిల్లాల్లోనూ మస్తు కేసులు

ఫీవర్ సర్వేలో భాగంగా చాలా జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కరోనా అనుమానితులు బయటపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 9 వరకు 3 లక్షల 3 వేల 418 ఇండ్లల్లో సర్వే చేయగా 10,858 మందికి కరోనా లక్షణాలున్నట్టు గుర్తించారు. మహబూబ్‌‌నగర్ జిల్లాలో 2,01,636 ఇండ్లలో సర్వే చేయగా 7,155 మందికి లక్షణాలు బయటపడ్డాయని హెల్త్ స్టాఫ్ వెల్లడించారు. ఆ తర్వాత సూర్యాపేటలో 6,613 మందిని, సంగారెడ్డిలో 6,533 మందిని, జగిత్యాలలో 6,422, మంచిర్యాలలో 6,400, కరీంనగర్‌‌లో 6,048, మెదక్‌‌లో 6,000, ఆదిలాబాద్‌‌లో 4,937, కామారెడ్డిలో 4,217, వనపర్తిలో 4,000 మందిని గుర్తించారు. చాలా మందికి జ్వరం ఉంటున్నట్లు హెల్త్ స్టాఫ్ చెబుతున్నారు. టెస్టులు చేయకపోవడంతో వారికి కరోనా ఉందా లేదా తెలియట్లేదు. సీరియస్‌‌గా ఉన్న వారిని హాస్పిటల్‌‌కు తరలిస్తున్నామని చెబుతున్నారు. స్వల్ప లక్షణాలుంటే హోం ఐసోలేషన్ కిట్లు ఇస్తున్నామని అంటున్నారు. కానీ చాలా జిల్లాల్లో సరిపడా కిట్లు లేక పెండింగ్​పెడుతున్నారు. మెదక్ జిల్లాలో 6 వేల మందికి లక్షణాలుంటే ఇప్పటివరకు 4 వేల మందికే కిట్స్ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లాలో 1,672 మందికి లక్షణాలు గుర్తించగా 1,200 కిట్స్‌‌ మాత్రమే అందించారు. దీంతో లక్షణాలున్న పబ్లిక్ కిట్ల కోసం ఆందోళన చెందుతున్నారు. కొందరు మెడికల్ షాపుల్లో తీసుకుంటున్నారు. 

ఉన్నదో లేదో తెలుస్తలేదు

గ్రామాల్లో ఫీవర్ సర్వే చేసి వివరాలు తీస్కుంటున్నరు. జ్వరం, దగ్గు, జలుబు ఉందా? అని అడుగుతున్నరు. ఉందని చెప్తే మెడికల్ కిట్లు  ఇచ్చిపోతున్నరు. టెస్టులు చేస్తలేరు. లక్షణాలుంటే కరోనా ఉన్నట్టా, లేనట్టా తెలుస్తలేదు. పూజారిని కాబట్టి ఎందుకైనా మంచిదని కిట్ తీసుకొని మందులు వాడుతున్న. 
‑ జానకీపురం రవిశర్మ, ముల్కనూరు, వరంగల్ అర్బన్ జిల్లా