ఐలాండ్ అద్భుతం.. చుట్టూ నీళ్లు మధ్య లో అరెకరం... వెయ్యి మంది జనాభా.. ఒక్కడే డాక్టర్

  ఐలాండ్ అద్భుతం.. చుట్టూ నీళ్లు మధ్య లో అరెకరం...  వెయ్యి మంది జనాభా.. ఒక్కడే డాక్టర్

నీళ్లలో తేలిన తాబేలు మీద ఐరన్ డిప్ప పెడితే ఎట్లుంటదో.. అట్లా కనిపిస్తున్న ఈ ఐలాండ్ పేరు మిగింగో. ఉగాండా, కెన్యా బార్డర్లో ఉన్న విక్టోరియాలేక్ మధ్యలో ఉన్నది. అత్యధిక జనసాంద్రత కలిగిన ఐలాండ్స్ లో ఇదీ ఒకటి! ఇనుపరేకుల ఇండ్లు... ఇరుకు ఇరుకు గదులు. ఒక్కడంటే ఒక డాక్టర్. ఒక్కటంటే ఒకటే మెడికల్​ షాపు, కిరాణా, కేఫ్, బార్, రెస్టారెంట్ ఇక్కడ ఉన్నాయి. వీళ్లకు కరెంట్, టీవీ ఫెసిలిటీ కూడా ఉన్నది. 

ప్రతి ఇంట్లో రెగ్యులర్​ గా  మొక్కజొన్నతో చేసుకునే ఉగాలి వంటకాన్ని చేపల కాంబినేషన్​ తో తింటారు. ప్రస్తుతం కెన్యా, ఉగాండా నుంచి వచ్చే జాలర్లు ఇక్కడ ఉండాలంటే ఐలాండ్​ లో  సొంతిండ్లు ఉన్నవాళ్లకు రెంట్ కడుతుంటారు. నిజానికి ఇక్కడ బతకడం కత్తిమీద సామే! కానీ, స్పేస్ మేనెజ్ మెంట్ ఎలా ఉంటుందో వీళ్లను చూసే నేర్చుకోవాలని అంటారు ఈ ఐలాండ్ ని చూసాచ్చినవాళ్లు! అరెకరానికి కొంచెం ఎక్కువగా ఉండే ఈ ఐలాండ్​ లో  వెయ్యికిపైగా జనాభా ఉంది. 

బోట్లలో వెళ్లి సరస్సులో చేపలు పట్టుకొని మిగింగోకి వస్తారు. వ్యాపారులు ఇక్కడికొచ్చి కొనుక్కొని పోతారు. 'ఈ ఐలాండ్ మాదంటే మాది' అని ఉగాండా, కెన్యా ఎప్పటి నుంచో పంచాయితీ పెట్టుకుంటున్నాయి. అయితే, ఇక్కడ రెండు దేశాలవాళ్లూ ఉన్నారు. పక్కపక్కనే ఉంటూ ప్రశాంతంగా బతుకుతున్నారు. 'ఏ దేశం అయితేనేం? చేపలు పట్టుకోవడం.. వాటిని అమ్మి కడుపు నింపుకోవడం. ఇదే తెలుసు మాకు' అంటారు ఇక్కడివాళ్లు.

 చేపలు పట్టుకొని తీరం చేరడం చాలా కష్టం అవుతుందని నలభై ఏళ్ల కింద ఇద్దరు కెన్యా జాలర్లు ఇక్కడికొచ్చి ఇల్లు కట్టుకున్నారు. అప్పుడు పాములు, విషపురుగులు మాత్రమే ఉండేవట! అలా ఒకరి తర్వాత ఒకరు జాలర్ల ఫ్యామిలీలు ఇక్కడికి చేరుకున్నాయి. సరస్సు చుట్టుపక్కల ఉండే గ్రామాలకు చెందినవాళ్లు మాత్రం మిగింగోలో ఉండేవాళ్లు సముద్రదొంగలు అని చెప్తుంటారు.