చిన్న లిఫ్టులను పట్టించుకోవడం లేదు

చిన్న లిఫ్టులను పట్టించుకోవడం లేదు


వనపర్తి : ఇరిగేషన్‌‌ ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసి రైతులకు సాగునీరు అందిస్తున్నామని చెబుతున్న సర్కారు.. క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. పెద్ద ప్రాజెక్టుల సంగతి పక్కన పెడితే చిన్న లిఫ్టులను పట్టించుకోవడం లేదు. రిపేర్లు, మెయింటెనెన్స్‌‌కు కూడా ఫండ్‌‌ ఇవ్వకపోవడంతో చాలాలిఫ్టులు వృథాగా మారాయి.  కొన్ని లిఫ్టులైతే మొత్తానికి పనిచేయడం లేదు.  వానాకాలం సీజన్ ప్రారంభమై 15 రోజులు దాటినా ఇరిగేషన్ ఆఫీసర్లు లిఫ్టుల మోటార్లకు, పంప్ సెట్లకు గ్రీసింగ్ , వైరింగ్ లాంటి పనులు కూడా చేయడం లేదు.  దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.  మరో 15 రోజుల్లో నాట్లు వేయాల్సి ఉందని, సాగునీరు ఇవ్వకపోతే పడావు పెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు.

చిన్నలిఫ్టుల కింద 2 వేల నుంచి 15 వేల ఎకరాలు
ఉమ్మడి జిల్లాలో భీమా పేజ్–1, పేజ్–2 తో పాటు కేఎల్‌‌ఐ, సంగంబండ, కోయిల్ సాగర్‌‌‌‌ లాంటి పెద్ద లిఫ్టులతో పాటు అమరచింత, సరళా సాగర్, నెల్విడి, శంకరసముద్రం లాంటి చిన్నలిఫ్టులు ఉన్నాయి. చిన్నలిఫ్టుల కింద 2 వేల ఎకరాల నుంచి 15 వేల ఎకరాల దాకా ఆయకట్టు ఉంది.  వీటిని సర్కారు పట్టించుకోకపోవడంతో ప్రతి యేడు సగం ఆయకట్టుకు కూడా నీళ్లు రావడం లేదు.  కొన్ని మూలకు పడేయడంతో మోటార్లు తప్పుపట్టి పోతున్నాయి.  ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని రైతులు , సాగునీటి సంఘం సభ్యులు ఆవేదన చెందుతున్నారు.  

మూలకుపడ్డ నెల్విడి
2006లో అప్పటి సర్కారు మదనాపురం మండలంలో రామన్ పాడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 3,600 ఎకరాలకు సాగునీరందించేందుకు రూ. 15 కోట్లతో నెల్విడి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. ఈ పథకం కింద నెల్విడి, నరసింగాపురం, కొన్నూర్, ద్వారక నగరం గ్రామాలతో పాటు మరో 2 తండాలకు నీరిచ్చేందుకు పైప్ లైన్లు నిర్మించడంతో పాటు నీటిని లిఫ్ట్ చేసేందుకు నాలుగు మోటార్లను ఏర్పాటు చేశారు. కానీ, నాణ్యత లేని పైపులైన్ల కారణంగా తరచూ లీకేజీలు ఏర్పడుతుండడంతో మూలకు పడేశారు. 12 వేల ఎకరాలకు సాగునీరు అందించే సరళాసాగర్, శంకర సముద్రం లిఫ్టులను కూడా ఇరిగేషన్‌‌ ఆఫీసర్లు రన్ చేయడం లేదు.  వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లోని  చిన్నమరూర్, గోపల్ దిన్నె, పెద్దమరూర్ ఎత్తిపోతల పథకాలు సైతం పనిచేయడం లేదు.  

లక్ష్యం చేరని ఆయకట్టు 
వనపర్తి జిల్లాలోని బీమా పేజ్–2 ఎత్తిపోతల పథకం ద్వారా 1.09 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నా  50 వేల ఎకరాలకు మించడం లేదు.  ఆఫీసర్లు కేవలం శంకరసముద్రం, రంగ సముద్రం రిజర్వాయర్లకు నీటిని తరలించి చేతులు దులుపుకుంటున్నారు.  కొత్త ఆయకట్టుకు కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ చానెళ్లను నిర్మించకపోవడంతో ఈ పథకం ప్రారంభమై 8 ఏళ్లు కావస్తున్నా లక్ష్యం నెరవేరడం లేదు.  శంకర సముద్రం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వకపోడంతో వాళ్లు గ్రామాలను  ఖాళీ చేయడం లేదు. దీంతో రిజర్వాయర్‌‌‌‌ను పూర్తిస్థాయిలో నింపడం లేదు. ఫలితంగా 30 వేల ఎకరాల ఆయకట్టు ఉన్న శంకర సముద్రం కుడి కాలువకు నీరు అందకపోవడంతో ఆ భూములన్నీ బీళ్లుగా మారాయి.   కేఎల్‌‌ఐ ద్వారా  ఫీడర్ చానల్ ను నిర్మించి వనపర్తి జిల్లాలోని గొలుసుకట్టు చెరువులకు నీటిని తరలిస్తున్నా.. నీటి ప్రవాహంపై అదుపు లేపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.  ఖిల్లా ఘనపురం, పెద్దమందడి, గోపాల్ పేట మండలాల పరిధిలో కేఎల్‌‌ఐ  నీరు వృథాగా పోతుండడంతో చివరి ఆయకట్టుకు నీరు చేరడం లేదని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. 

జూరాలకు వరద లేకే ఆలస్యం
వనపర్తి, గద్వాల జిల్లాలతో పాటు కృష్ణా నదిపై ఉన్న లిఫ్ట్ లు జూరాల ప్రాజెక్టు లోకి వరద వస్తేనే ప్రారంభం అవుతాయి. ఈ సారి కృష్ణా బేసిన్‌‌లో సరైన వర్షాలు లేక జూరాలకు పూర్తి స్థాయిలో నీరు చేరలేదు.  వరి నాట్లు వేసుకునేందుకు మరో నెల రోజులు సమయం ఉంది. అప్పటి లోగా రైతులు బోర్లు,బావుల సాయంతో నారుమళ్లు పెంచుకుంటే నాట్లు సకాలంలో వేసుకోవచ్చు. వనపర్తి జిల్లాలో ఆరు లిఫ్టుల రిపేర్ల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినం.
- సురేంద్ర బాబు, డీ5 ఈఈ