హైదరాబాద్‌సిటీ, వెలుగు: నానక్ రాంగూడ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో సీవరేజ్ సిస్టమ్‌ను మెరుగుపరచడానికి, ట్రంక్ మెయిన్ల అభివృద్ధికి మినీ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని వాటర్‌బోర్డు ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం గచ్చిబౌలి, నానక్ రాం గూడ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలను పరిశీలించారు.
భవిష్యత్ అవసరాలను బట్టి సీవరేజ్ లైన్లను, ట్రంక్ మెయిన్ల అభివృద్ధికి మినీ సీవరేజ్ ప్లాన్లను రూపొందించాలని ఆదేశించారు. మూసీ, ఇతర సమీప చెరువుల్లోకి మురుగు చేరి కలుషితం కాకుండా వర్షపు నీటి కాల్వల నుంచి మురుగు నీటి పైపు లైన్లను వేరుచేసి 2047 మాస్టర్ ప్లాన్ ఆధారంగా సీవరేజ్ ట్రంక్ మెయిన్ల, సబ్ సీవరేజ్ లైన్ల నిర్మాణం కోసం ప్రతిపాదనను సమర్పించాలన్నారు.
గచ్చిబౌలి నుంచి కోకాపేట్పరిసర ప్రాంతాల్లో మురుగును కోకాపేట ఎస్టీపీకి తరలించి శుద్ధి చేయడానికి సీవర్ ట్రంక్ మెయిన్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సమర్పించాలని, అలాగే కోకాపేట్ కింది ప్రాంతాల్లోని మురుగును సమీపంలోని చిత్రపురి, ఇబ్రహీంచెరువు ఎస్టీపీకి మళ్లించడానికి ప్లాన్లు రూపొందించాలని ఆదేశించారు. అంతకుముందు నానక్ రాంగూడలోని 4.5 ఎమ్మెల్డీల సామర్థ్యం కలిగిన ఎస్టీపీని సందర్శించారు.
సమీప ప్రాంతాల్లోంచి వచ్చే మురుగును ఈ ఎస్టీపీలో శుద్ధి చేసే సామర్థ్యం ఉందా? లేకుంటే సామర్థ్యం పెంచడానికి, కొత్త ఎస్టీపీ నిర్మించడానికి సాధ్యసాధ్యాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. నానక్ రాంగూడ ఎస్టీపీలో శుద్ధి చేసిన నీటిని గోల్ఫ్ కోర్టులో వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అందుకు ఓఆర్ఆర్ వెంట శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడానికి పైప్ లైన్ నిర్మించడానికి డీపీఆర్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
