టైటాన్ సెబ్​మెరైన్ ప్రయాణికులు మృతి

టైటాన్ సెబ్​మెరైన్ ప్రయాణికులు మృతి
  • అధికారుల శ్రమకు దక్కని ఫలితం

బోస్టన్: టైటానిక్ షిప్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన ప్రయాణికులు మరణించినట్లు జలాంతర్గామి సంస్థ ఓషన్ గేట్  తెలిపింది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ఈ విషద ఘటన పూర్వాపరాలు... అట్లాంటిక్ మహా సముద్రంలో గల్లంతైన మినీ జలాంతర్గామి ‘టైటాన్’ ఆచూకీ  కోసం రెస్క్యూ టీమ్స్ నాలుగు రోజులుగా సముద్రంలో జల్లెడ పడుతున్నా టైటాన్ కు సంబంధించి ఎలాంటి సమాచారం అందలేదు. కొన్ని ప్రాంతాల్లో శబ్దాలు వినిపిస్తున్నాయని గుర్తించిన రెస్క్యూ టీమ్స్.. అక్కడికి వెళ్లి గాలించినప్పటికీ ఏమీ కనిపించలేదు. టైటాన్ మినీ జలాంతర్గామిలో 96 గంటలకు సరిపడా ఎమర్జెన్సీ ఆక్సిజన్ ఉందని, అయితే అది ఇప్పటికే అయిపోయి ఉంటుందని నిపుణులు చెప్పారు. 

అమెరికాకు చెందిన ఓషియన్ గేట్​ఎక్స్ పెడిషన్స్ కంపెనీ అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలను చూపించేందుకు యాత్ర చేపట్టింది. ముగ్గురు టూరిస్టులు, ఇద్దరు సిబ్బందితో ‘టైటాన్’ మినీ జలాంతర్గామి ఆదివారం ఉదయం 8:15 గంటలకు (మన టైమ్ ప్రకారం ఆదివారం సాయంత్రం 7:15) న్యూఫౌండ్ ల్యాండ్ నుంచి బయలుదేరింది. అయితే ఆ తర్వాత రెండు గంటల్లోనే అది గల్లంతయింది.

అందులో నాలుగు రోజులకు సరిపడా (96 గంటలు) ఆక్సిజన్ నిల్వ ఉందని కంపెనీ పేర్కొంది. అయితే ఇప్పటికే జలాంతర్గామి గల్లంతై నాలుగు రోజులు గడుస్తోంది. గురువారం సాయంత్రం 7:15 గంటలకే ఆక్సిజన్ అయిపోయి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందులోని వాళ్లకు ఆహారం కూడా తక్కువే ఉందని అంటున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, అందులోని వాళ్లు బతికే పరిస్థితి లేదంటున్నారు. 

టైటాన్ లో ఉన్నది వీళ్లే.. 

బ్రిటన్ బిజినెస్ మెన్ హమీష్ హార్డింగ్, పాకిస్తాన్ వ్యాపారవేత్త షహజాదా దావూద్, ఆయన కొడుకు సులేమాన్, ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్, ఫ్రెంచ్ మాజీ నావికా అధికారి పాల్ హెన్రీ.

భద్రతపై అనుమానాలు.. 

టైటాన్ ఆచూకీ కనిపెట్టేందుకు వివిధ దేశాల రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. సోమవారం నుంచే అమెరికా కోస్ట్ గార్డ్ సిబ్బంది, కెనడా సైనిక విమానాలు, ఫ్రెంచ్ నౌకలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. రోబోలను కూడా రంగంలోకి దించారు. ఈ క్రమంలో బుధవారం కొన్ని శబ్దాలను కెనడా విమానం గుర్తించింది. అవి టైటాన్ వే అని భావించి, రెస్క్యూ టీమ్స్ మొత్తం అక్కడికి వెళ్లి గాలిస్తున్నాయి. అయితే ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది స్పష్టంగా తెలియలేదు. ఈ క్రమంలోనే టైటాన్ ఆచూకీ లభించడం అందులోని వారు మరణించడం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.