- కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని మంత్రి అడ్లూరి పిలుపు
హైదరాబాద్, వెలుగు: దివ్యాంగులు గౌరవప్రదమైన జీవనం కొనసాగించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. దివ్యాంగులు కేవలం సహాయం పొందే వర్గం కాదని, అవకాశం ఇస్తే తమ కాళ్లపై తామే నిలబడి ఆత్మవిశ్వాసంతో జీవించగల సామర్థ్యం ఉన్న పౌరులని మంత్రి చెప్పారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని అలెన్ ఇన్నోవేషన్స్ కార్యాలయంలో నిర్వహించిన దివ్యాంగుల కోసం అసిస్టివ్ టెక్నాలజీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అలెన్ ఇన్నోవేషన్స్ రూపొందించిన నావినాల్ట్ అనే అసిస్టివ్ టెక్ పరికరాలను 20 మందికి పైగా దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు అడ్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యోగాలు చేస్తున్న దివ్యాంగులు ఎవరి మీద ఆధారపడకుండా తమ వృత్తి గౌరవాన్ని కాపాడుకునేలా ఈ పరికరాలు ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. బాష్ వంటి సంస్థలు ముందుకు వచ్చినట్టే మరిన్ని కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ ద్వారా దివ్యాంగుల సాధికారతలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.
