యూరియాపై కేటీఆర్‎కు కనీస అవగాహన లేదు.. నోటికొచ్చింది మాట్లాడుతున్నరు: మంత్రి లక్ష్మణ్

యూరియాపై కేటీఆర్‎కు కనీస అవగాహన లేదు.. నోటికొచ్చింది మాట్లాడుతున్నరు: మంత్రి లక్ష్మణ్

రాజన్న సిరిసిల్లా: యూరియా పంపిణీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని.. రాష్ట్ర ప్రభుత్వం వల్లే యూరియా కొరత అంటూ కేటీఆర్‎ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. మంగళవారం (సెప్టెంబర్ 16) సిరిసిల్లా పట్టణంలో మాదిగ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేంద్రం నుంచి తెలంగాణకు రావలసిన యూరియా కోటా కోసం పార్లమెంట్ ముందు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిరసన తెలిపితే.. బీఆర్ఎస్ ఎంపీలు రాకుండా ఎక్కడికి పోయారని ప్రశ్నించారు.

ఇతర దేశాల నుండి ముడి సరుకులు తెప్పించుకొని యూరియాని తయారుచేసి రాష్ట్రాలకి పంపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. యూరియా పంపిణీపై బీఆర్ఎస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు అబద్ధాన్ని కూడా నిజం చేయగల నేర్పరులని ఎద్దేవా చేశారు. తెలంగాణ యాస భాషను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరు కాలాలు కష్టపడ్డ రైతన్నల దగ్గర కటింగ్ లేకుండా ఎన్నడైనా వడ్లు కొనుగోలు చేశారా అని కేటీఆర్‎ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేసిన అప్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడిందని.. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలిపారు.