హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కాలేజీలలో చదువుకొని ఎంబీబీఎస్, బీడీఎస్, ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సత్కరించారు. మంగళవారం బంజారా హిల్స్ లోని కుమ్రంభీం ఆదివాసీ భవన్ లో నిర్వహించిన ‘ఉడాన్ 2025 - సోరింగ్ బియాండ్ డ్రీమ్స్ టువార్డ్స్ ఎక్సలెన్స్’ కార్యక్రమంలోమంత్రి పాల్గొని విద్యార్థులకు మెమొంటోలు అందజేశారు. మొత్తం 50 మంది విద్యార్థులను సన్మానించారు.
వీరిలో 11 మంది ఐఐటీలు, ఎన్ఐటీల్లో, 36 మంది ఎంబీబీఎస్, ముగ్గురు బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సంస్థ, విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రుల మధ్య రిలేషన్ బలపడటానికి రూపొందించిన ‘టీఎంఆర్ఈఐఎస్ టైమ్స్’ న్యూస్ లెటర్ ను మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు మహ్మద్ అలీ షబ్బీర్, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ వైస్ చైర్మన్, ప్రెసిడెంట్ మహ్మద్ ఫహీముుద్దీన్ ఖురేషీ, మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, టీజీఎంఆర్ఈఐఎస్ కార్యదర్శి షఫీఉల్లాహ్ పాల్గొన్నారు.
