- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
పెగడపల్లి/ధర్మపురి, వెలుగు: ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆరోపించారు. పీసీసీ ఆధ్వర్యంలో సోమవారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించిన బూత్ లెవెల్ పోలింగ్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ధర్మపురి నియోజకవర్గంలో 2.37 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, ప్రతి ఓటు నమోదయ్యేలా బూత్ లెవెల్ ఏజెంట్లు పనిచేయాలని సూచించారు. మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్ చేస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు.
వడ్ల కొనుగోలు, ఇసుక రవాణాలో తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని మరోసారి సవాల్ విసిరారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్యోగులకు జీతాల పెంపు ఉత్తర్వులను అందజేశారు. ధర్మపురి ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి నిధులు మంజూరుతోపాటు, కొత్తగా 13 రూట్లలో బస్సుల నడిపించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
