ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీ వ్యక్తి మృతి: మంత్రి బొత్స

ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీ వ్యక్తి  మృతి: మంత్రి బొత్స

ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన  వ్యక్తి మృతి చెందారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. మృతుడు  శ్రీకాకుళం జిల్లాకు చెందిన గురుమూర్తిగా గుర్తించామని చెప్పారు. ఏపీలో పెన్షన్ తీసుకుని ఒడిశా వెళ్తుండగా చనిపోయారని చెప్పారు. సంతబొమ్మాళికి చెందిన గురుమూర్తి ఒడిశాలోని బాలాసోర్ లో  నివాసం  ఉంటున్నారని తెలిపారు. ఆయన మృతదేహాన్ని బాలాసోర్ లోని కుటుంబ సభ్యులకు అప్పగించారు. జూన్ 3న  గురుమూర్తి అంత్యక్రియలు పూర్తయ్యాయి.

  గురుమూర్తి కుటుబానికి 10 లక్షల పరిహారం ప్రకటించారు మంత్రి బొత్స.  ప్రమాదంలో గాయపడిన వారికి కూడా పరిహారం ప్రకటిస్తామన్నారు. ఆస్పత్రిలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. రైలు ప్రమాద బాధితులకు అండగా నిలుస్తామన్నారు. స్వల్పంగా గాయాలైన  11 మందికి చికిత్స అందించి ఇంటికి పంపిచామని చెప్పారు. 

 జూన్ 2న రాత్రి ఒడిశాలోని బాలాసోర్ లో మూడు రైళ్లు ఢీ కొన్న ఘటనలో ఇప్పటి వరకు 288 మంది మృతి చెందగా.. 900 మందికి పైగా గాయాలైన సంగతి తెలిసిందే. ప్రమాదానికి గురైన కొరమండల్ ఎక్స్ ప్రెస్ లో ఏపీ వాసులు దాదాపు 400 మందికి పైగా ఉన్నారు. వీరందరికి ఎలాంటి గాయాలు కాలేదు.