
- మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నం
- ఆరోగ్యశ్రీ నిధులను ఇన్‌స్టాల్‌మెంట్లలో చెల్లిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 2002 రద్దు బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2010లో కేంద్ర ప్రభుత్వం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ చేసిందని, 2017లో ఆ చట్టాన్ని రాష్ట్రంలో అడాప్ట్ చేసుకున్నామని, 2022 నుంచి ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 2002 నాటి పాత చట్టాన్ని రద్దు చేస్తూ బిల్లు పెట్టినట్లు వివరించారు.
అలాగే, రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హాస్పిటళ్లల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తున్నామని, సుమారు 8 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశామని, మరో 8 వేలకుపైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశామని వెల్లడించారు. బిల్లు రద్దుపై చర్చ సందర్భంగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ మాట్లాడుతూ.. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ (2010) వలన చాలా ఉపయోగాలు ఉన్నాయన్నారు. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసిన మంత్రికి మద్దతు తెలిపారు. కాగజ్‌నగర్ లో సీహెచ్సీ లో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
6 నెలలుగా జీతాలుతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి వారంలోపు జీతాలిచ్చి ఆదుకోవాలని కోరారు. ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ చేశారు. బకాయిల చెల్లింపుపై ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల యజమాన్యాలతో చర్చించామని మంత్రి వెల్లడించారు. ప్రతి నెల 6 నుంచి 7 ఇన్‌స్టాల్మెంట్లలో బిల్లులను క్లియర్ చేయాలని నిర్ణయించామన్నారు. మరోసారి ఆస్పత్రుల యజమాన్యాలతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.