ఏటీసీ సెంటర్లను సద్వినియోగంచేసుకోవాలి : మంత్రి దామోదర రాజనర్సింహ

ఏటీసీ సెంటర్లను సద్వినియోగంచేసుకోవాలి : మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి టౌన్, వెలుగు: యువతలో నైపుణ్యాలను పెంచి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అడ్వాన్స్ డ్​ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభిస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం పట్టణంలోని ఐటీఐ కాలేజీ  ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏటీసీ సెంటర్​ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పోటీ ప్రపంచంలో గెలవాలంటే సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. అందుకోసం ఏర్పాటుచేసిన అడ్వాన్స్​డ్​ టెక్నాలజీ సెంటర్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంగారెడ్డి, పటాన్​చెరు, హత్నూర ఐటీఐ కాలేజీల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఒక్కో ఏటీసీ కేంద్రానికి రూ.40 కోట్ల పరికరాలను అందించామని చెప్పారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఏటీసీ కేంద్రాల్లో ఫ్యూచర్ జాబ్స్ కి కావలసిన కొత్త శిక్షణ అందిస్తారన్నారు. టీజీఐఐసీ చైర్​పర్సన్ ​నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరంతరం కృషి చేస్తుందని, ఇప్పటివరకు 35 వేల ఉద్యోగాలను కల్పించిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ రామ్ రెడ్డి, అడిషనల్​లేబర్ కమిషనర్ గంగాధర్, ప్రిన్సిపాల్ తిరుపతి రెడ్డి  పాల్గొన్నారు.

 దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ

దివ్యాంగుల సంక్షేమంపై  ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని మంత్రి దామోదర అన్నారు. జిల్లా మహిళా శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఐటీఐ కాలేజీ ప్రాంగణంలో వివిధ మండలాలకు చెందిన 138 మంది దివ్యాంగులకు పరికరాలను  పంపిణీ చేశారు. 

 ఏటీసీ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

 సంగారెడ్డి (హత్నూర): ప్రభుత్వం కోట్లు వెచ్చించి ఏర్పాటు చేస్తున్న ఏటీసీ సెంటర్లను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సునీతా రెడ్డి సూచించారు. హత్నూర ఐటీఐలో ఏర్పాటుచేసిన ఏటీసీ సెంటర్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువతలో నైపుణ్యాలను పెంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలన్నారు. కార్యక్రమంలో టీజీ డిప్యూటీ జోనల్ మేనజర్ ప్రభావతి,  ప్రిన్సిపాల్ సుబ్బలక్ష్మి, డీటీ దావూద్, ఆఫీసర్లు పాల్గొన్నారు.