- వైద్యశాఖలో ఖాళీల భర్తీకి ప్రాధాన్యమిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కరోనా టైంలో నర్సులు అందించిన సేవలు ప్రశంసనీయమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్ లో 1,919 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నర్సింగ్ అనేది మానవత్వానికి ఇచ్చే గొప్ప భరోసా అని స్పష్టం చేశారు. రోగులకు చికిత్సతో పాటు ధైర్యాన్ని, ఆశను కల్పించేది నర్సులేనని.. ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు. వైద్యశాఖలో ఖాళీల భర్తీకి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గత రెండున్నరేళ్లలో దాదాపు 13 వేల పోస్టులను భర్తీ చేశామని తెలిపారు.
ఇప్పటివరకు 9 వేల నర్సింగ్పోస్టులను భర్తీ చేయగా, మరో 5 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని.. రెండు రోజుల్లో 2 వేల ఏఎన్‌ఎం పోస్టుల ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించారు. నర్సుల వృత్తిపరమైన అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేకంగా 'నర్సింగ్ డైరెక్టరేట్' ఏర్పాటు చేయబోతున్నామని, విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం జర్మన్, జపాన్ వంటి భాషల్లో ప్రభుత్వమే ప్రత్యేక శిక్షణ ఇస్తోందని పేర్కొన్నారు.
కొత్తగా 16 నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేసి 960 బీఎస్సీ నర్సింగ్ సీట్లను అందుబాటులోకి తెచ్చామని, ప్రభుత్వ దవాఖానల్లో పూర్తిస్థాయి సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, మీర్జా రహ్మత్ బేగ్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగు, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
