మానుకోట మార్చురీ ఘటనపై విచారణ..ఆదేశించిన మంత్రి దామోదర రాజనర్సింహ

మానుకోట మార్చురీ ఘటనపై విచారణ..ఆదేశించిన మంత్రి దామోదర రాజనర్సింహ
  • ముగ్గురు సీనియర్ ప్రొఫెసర్లతో ఎంక్వైరీ కమిటీ
  • బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే మురళీ నాయక్‌

హైదరాబాద్, వెలుగు : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్‌లో చనిపోయాడని భావించి బతికున్న వ్యక్తిని మార్చురీలో ఉంచిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్‌ అయ్యారు. ఆ ఘటనకు సంబంధించిన నిజనిజాలు తేల్చాలని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ నరేంద్రకుమార్‌ను ఆదేశించారు. 

దీంతో స్పందించిన డీఎంఈ ములుగు జనరల్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ వి.చంద్రశేఖర్, జనగాం మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌కు చెందిన జనరల్ సర్జరీ డిపార్ట్‌మెంట్‌ హెచ్‌వోడీ గోపాల్‌రావు, సిద్దిపేట జనరల్ హాస్పిటల్‌ ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ హెచ్‌వోడీ ఆర్. శ్రీధరాచారితో ఎంక్వైరీ కమిటీని నియమించారు. మహబూబాబాద్‌ ఘటనపై విచారణ జరిపిన కమిటీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల్లోపు రిపోర్ట్‌ను డీఎంఈ ఆఫీస్‌కు పంపించింది. 

ఎమ్మెల్యే మురళీనాయక్‌ ఆగ్రహం

మహబూబాబాద్‌ అర్బన్‌, వెలుగు : మహబూబాబాద్‌ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో బతికున్న వ్యక్తిని మార్చురీలో పడేసిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మురళీనాయక్‌ శుక్రవారం హాస్పిటల్‌కు చేరుకున్నారు. బాధితుడు రాజును పరామర్శించిన అనంతరం వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.