పారదర్శకంగా ట్రాన్స్ఫర్ల ప్రక్రియ..హాస్పిటల్స్ లో సుదీర్ఘంగా పనిచేస్తున్న వారికి ప్రయారిటీ ఇస్తం : మంత్రి దామోదర రాజనర్సింహ

పారదర్శకంగా ట్రాన్స్ఫర్ల ప్రక్రియ..హాస్పిటల్స్ లో సుదీర్ఘంగా పనిచేస్తున్న వారికి ప్రయారిటీ ఇస్తం : మంత్రి దామోదర రాజనర్సింహ
  • డాక్టర్ల సంఘాలకు మంత్రి దామోదర హామీ
  • టిమ్స్ లో ట్రయల్ రన్ సేవలపై ఆరా తీసిన మంత్రి

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఇచ్చిన జీఓ 38 ప్రకారం పారదర్శకంగా బదిలీల ప్రక్రియ చేపడుతామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ఈ మేరకు గవర్నమెంట్  డాక్టర్ల అసోసియేషన్‌‌‌‌  ప్రతినిధులతో మంత్రి సోమవారం సమావేశం నిర్వహించారు. సెక్రటేరియెట్‌‌‌‌ లోని మంత్రి చాంబర్‌‌‌‌ ‌‌‌‌లో జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్  చొంగ్తు, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్  అజయ్‌‌‌‌  కుమార్, గవర్నమెంట్  డాక్టర్ల అసోసియేషన్  ప్రెసిడెంట్  నరహరి, జనరల్  సెక్రటరీ లాలూప్రసాద్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

గతంలో జనరల్ ట్రాన్స్‌‌‌‌ ఫర్లు పారదర్శకంగా జరిగాయని, ఈసారి కూడా అదేవిధంగా ట్రాన్స్‌‌‌‌ ఫర్లు ఆఫ్ లైన్‌‌‌‌ లో చేయాలని డాక్టర్లు కోరారు. టీజీడీఏ ఆఫీస్ బేరర్లకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని తదితర ప్రతిపాదనలను మంత్రి ముందు ఉంచారు.మంత్రి మాట్లాడుతూ.. కాలేజీలు, హాస్పిటళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని జీఓ ప్రకారం ట్రాన్స్‌‌‌‌ ఫర్లు ఉంటాయన్నారు. అడ్మినిస్ట్రేషన్, టీచింగ్, క్లినికల్  వర్క్‌‌‌‌ కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాల్లోని కాలేజీలు, హాస్పిటళ్లలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నవారికి బదిలీల్లో అవకాశం కల్పిస్తామని స్పష్టంచేశారు. 

పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి 

పేషెంట్లకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేలా సనత్‌‌‌‌ నగర్  టిమ్స్‌‌‌‌ను తీర్చిదిద్దాలని అధికారులను మంత్రి దామోదర ఆదేశించారు. సనత్‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌ టిమ్స్‌‌‌‌ లో జరుగుతున్న వైద్యసేవల ట్రయల్ రన్‌‌‌‌ పై మంత్రి సోమవారం రివ్యూ చేశారు. ట్రయల్‌‌‌‌ రన్‌‌‌‌ లో భాగంగా అందిస్తున్న వైద్యసేవల వివరాలను, ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులు మంత్రికి వివరించారు. సీటీ స్కాన్, ఎంఆర్‌‌‌‌ఐ, డిజిటల్  ఎక్స్- రే మెషీన్లు, డయాగ్నస్టిక్స్  మెషెన్ల ఇన్‌‌‌‌ స్టలేషన్  పూర్తి అయిందని చెప్పారు.

సెంటర్  ఆఫ్  ఎక్సలెన్స్ ఫర్  కార్డియాక్ కేర్‌‌‌‌‌‌‌‌, సెంటర్  ఆఫ్  ఎక్స్‌‌‌‌ లెన్స్  ఫర్  ఆర్గాన్  ట్రాన్స్‌‌‌‌ ప్లాంటేషన్‌‌‌‌ కు అనుగుణంగా అన్నిరకాల సేవల ఏర్పాటుపై మంత్రి ఆరా తీశారు. క్యాథల్యాబ్  ఏర్పాటు పనులు పూర్తయ్యాయని, ట్రయల్ రన్‌‌‌‌ కు సిద్ధంగా ఉందని అధికారులు వివరించారు. పేషెంట్లు, వారి అటెండెంట్లకు భోజన సదుపాయం కల్పించాలని, అటెండెంట్ల కోసం ధర్మశాలను సైతం సిద్ధం చేయాలని మంత్రి సూచించారు.