వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు : మంత్రి దామోదర రాజనర్సింహ

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు :  మంత్రి దామోదర రాజనర్సింహ
  • వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు
  • మంత్రి దామోదర రాజనర్సింహ

జోగిపేట, వెలుగు : వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పకుండా హామీలన్ని నెరవేర్చిందని గుర్తు చేశారు. ఎవరు సందేహ పడాల్సిన అవసరం లేదని ఈ సారి కూడా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. ఆదివారం జోగిపేట బస్టాండ్​లో మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ స్కీంలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకాన్ని మాజీ సీఎం రాజశేఖర్​రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినట్లు గుర్తు చేశారు. ఎంతో మంది పేద కుటుంబాలు బాగుపడ్డాయని చెప్పారు. తిరిగి అదే పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 

రూ.5 లక్షలు ఉన్న లిమిట్​ను రూ.10 లక్షలకు పెంచినట్లు చెప్పారు. రాష్ట్రంలో మహిళలు పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలు, బంధువుల వద్ద కు, మారుమూల ప్రాంతాలకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కీమ్ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. నియోజకవర్గానికి త్వరలో 50 పడకల ఆసుపత్రిని తీసుకువస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో కలెక్టర్ శరత్​కుమార్, వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.