- ఏఐని సమర్థవంతంగా వాడాలి
- సీఎఫ్ఓ సమిట్‌లో మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్, వెలుగు: ఏఐ ఆధారిత ఫైనాన్షియల్టెక్నాలజీలకు హైదరాబాద్ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అందుకే పెద్ద కంపెనీల జీసీసీలు భారీగా ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోని విజ్ఞానజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (వీజేఐఎం) క్యాంపస్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) శనివారం నిర్వహించిన సీఎఫ్ఓ సమిట్‌లో ఆయన మాట్లాడారు. ఏఐ టెక్నాలజీ ఆర్థిక సంస్థల పనితీరును సమూలంగా మారుస్తోందని, ఖర్చులను లెక్కించే స్థాయి నుంచి వినూత్న ఆవిష్కరణలు, మెరుగైన నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరిందని వివరించారు.
బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గాన్ చేస్, సిటీ గ్రూప్, వెల్స్ ఫార్గో లాంటి గ్లోబల్ సంస్థలు నగరంలో భారీ టెక్నాలజీ కేంద్రాలను నిర్వహిస్తున్నాయని మంత్రి గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని 400 జీసీసీలు మూడు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని, రాష్ట్ర ఐటీ ఎగుమతులు ఏటా 40 బిలియన్ డాలర్లకు చేరాయని వెల్లడించారు. డిజిటల్ మౌలిక వసతులను మెరుగుపర్చడానికి ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీ వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. డిజిటల్ యుగంలో పెట్టుబడులకు సీఎఫ్ఓలు దిశానిర్దేశం చేయాలని, ఏఐ టెక్నాలజీలను సమర్థంగా వాడుకోవాలని మంత్రి శ్రీధర్బాబు సూచించారు.
