సర్పంచ్‌‌‌‌లైతే కూలికి పోకూడదా?

సర్పంచ్‌‌‌‌లైతే కూలికి పోకూడదా?
  • వారికి వేరే తీరుగ ఆదాయం వస్తదా?: ఎర్రబెల్లి
  • గ్రామాల్లో ఒక్క రూపాయి కూడా పెండింగ్‌‌‌‌ లేదు
  • ఇతర పార్టీలోళ్లు వాళ్లను ఎగేసి రెచ్చగొడుతున్నరు
  • పాలకుర్తిలో పల్లె ప్రగతి పనులను పరిశీలించిన మంత్రి

పాలకుర్తి/హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో సర్పంచ్‌‌‌‌లు చేసిన పనులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా పెండింగ్‌‌‌‌లో లేదని, ఉంటే చెక్కులు చూపించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. సర్పంచ్‌‌‌‌లంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఇతర పార్టీల వాళ్లు ఎగేసి వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, కొన్ని పేపర్లు, మీడియా కూడా తప్పుగా రాస్తున్నాయని ఆరోపించారు. కొన్ని చోట్ల కూలీలే సర్పంచులయ్యారని అన్నారు. ‘సర్పంచులైతే కూలికి పోకూడదా? వారికేమైనా వేరే తీరుగా ఆదాయం వస్తుందా?’ అని ప్రశ్నించారు. ఆదివారం పాలకుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉదయమే అన్ని జిల్లాల సర్పంచుల సంఘం అధ్యక్షులు తనతో మాట్లాడారని.. సీఎం కేసీఆర్, హరీశ్‌‌‌‌రావు తమ బిల్లులు చెల్లించారని సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. ఈజీఎస్ డబ్బులు రూ.1,400 కోట్లు పెండింగ్‌‌‌‌లో ఉండగా.. అందులో రాష్ర్ట ప్రభుత్వం వాటా రూ.165 కోట్లు వెంటనే రిలీజ్ చేశామని, కేంద్రం ప్రభుత్వం దగ్గర రూ.800 కోట్లు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయన్నారు. సోమవారం సర్పంచులందరితో మీటింగ్ ఏర్పాటు చేశామనితెలిపారు. పల్లె ప్రగతిలో భాగంగా పాలకుర్తిలోని ఎస్సీ కాలనీ, గౌడ కాలనీ, బొడ్రాయి వీధితో పాటు పలు వాడుల్లో మంత్రి తిరిగారు. బొడ్రాయి వీధిలో పాత బావిని గమనించిన ఆయన.. అది ఎవరిదంటూ ఆరా తీశారు. కొంగరి ఐలోని బావది అని స్థానికులు చెప్పడంతో.. మంత్రి కూడా ఐలోని బావ అంటూ చమత్కరించారు. బావిని పూడ్చేయాలని సూచించారు. ఎస్సీ కాలనీలో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను క్లీన్ చేయించాలని ఆఫీసర్లను ఆదేశించారు.

చర్చలకు రమ్మని ముఖంచాటేసిన మంత్రి

సమస్యలపై చర్చించటానికి రావాలని చెప్పి, తాము వచ్చిన తర్వాత కలవకుండా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అవమానించారని సర్పంచ్‌‌‌‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేపు కలుద్దాం’ అని పీఏతో చెప్పించి వెళ్లిపోయారని ఫైర్ అయ్యారు. పెండింగ్ బిల్లులు, ఇతర సమస్యలపై తాము నిలదీస్తామని భయపడి తప్పించుకున్నారని ఆరోపించారు. పల్లె ప్రగతి జరుగుతున్న టైమ్‌‌‌‌లో హైదరాబాద్ వరకు చర్చలకు పిలిచి.. కలవకుండా వెళ్లడమేంటని సర్పంచ్‌‌‌‌ల సంఘం నేతలు ప్రణీల్ చందర్, ధనలక్ష్మి మండిపడ్డారు. తాము చాలా మంది రావటంతో మంత్రి ముఖం చాటేశారని అన్నారు. చర్చలకు మంత్రి ఆహ్వానించడంతో వివిధ జిల్లాల నుంచి సుమారు 200 మంది ఆదివారం ఉదయం మినిస్టర్ క్వార్టర్స్‌‌‌‌కు చేరుకున్నట్లు తెలిపారు.