రోడ్ల రిపేర్లు, నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలి

రోడ్ల రిపేర్లు, నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీ రాజ్ రోడ్ల లిస్ట్ వెంటనే రెడీ చేయాలని ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.  బుధవారం పీఆర్ అధికారులతో మంత్రి రివ్యూ చేపట్టారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా లిస్ట్ తయారు చేయాలని సూచించారు. వచ్చే నెల 10వ తేదీ నాటికి టెండర్లు పిలిచేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పనులకు సంబంధించి ఈ నెల 30వ తేదీలోపు మంజూరు తీసుకొని, డిసెంబర్ 15 నాటికి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.  

వర్షాలు, వరదనీటితో దెబ్బతిన్న రోడ్ల రిపేర్లు, నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రోడ్లపై ప్రయాణించే ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రిపేర్లు చేపట్టాలన్నారు. అలాగే, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మండలాలు, గ్రామ పంచాయతీలలో కొత్త సర్కిళ్లు, డివిజన్ల వారీగా వేయాల్సిన కొత్త రోడ్లను, అవసరమైన సిబ్బంది కోసం కొత్త పోస్టుల భర్తీకి సంబంధించి గురువారం కల్లా నివేదిక ఇవ్వాలన్నారు. రోడ్ల నిర్మాణంలో అటవీ భూముల సమస్యను గుర్తించి.. తగిన ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. నాణ్యతలో రాజీ పడకుండా ఆధునిక విధానాల ద్వారా పనులు చేయాలన్నారు.