కలెక్టర్‍, సీపీలకు మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలు 

కలెక్టర్‍, సీపీలకు మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలు 
  • చీరె రేటు చూడొద్దన్న మంత్రి 
  • తండ్రి, అన్న ఇచ్చే కానుక అనుకోవాలని సలహా

వరంగల్‍, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తున్న క్రమంలో ఎవరైనా.. ఎక్కడైనా ఆ చీరెలను కాలబెడితే సీరియస్‍ యాక్షన్‍ తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆదేశించారు. గ్రేటర్‍ వరంగల్‍ బతుకమ్మ, దసరా ఉత్సవాల నిర్వహణపై గురువారం హనుమకొండ కలెక్టరేట్​లో మంత్రి సత్యవతి రాథోడ్‍, ఇతర అధికారులు, ఉత్సవ కమిటీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ  బతుకమ్మ సందర్భంగా సీఎం కేసీఆర్‍ ఇచ్చే చీరె రేటు ఎంత అని ఆలోచించొద్దన్నారు. సీఎం కేసీఆర్‍ ఓ తండ్రిగా, అన్నగా ఇస్తున్న కానుకగా భావించాలన్నారు. ఎక్కడైనా బతుకమ్మ చీరెలకు నిప్పు పెడితే వారిపై సీరియస్‍ యాక్షన్‍ తీసుకోవాలని కలెక్టర్లు గోపి, రాజీవ్​గాంధీ హనుమంతు, సీపీ తరుణ్​ జోషిలను అదేశించారు.

వరంగల్‍ జిల్లా గ్రేటర్‍ పరిధిలో ప్రధానంగా ఆరుచోట్ల ఉత్సవాల నిర్వహణలో గతేడాది కొన్ని లోపాలు కనిపించాయని.. ఈసారి అలాంటివి జరగకుండా అధికారులు, కమిటీలు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం తరఫున కొన్ని ఏర్పాట్లు చేస్తామని.. కమిటీ సైతం కొందరు దాతల సాయం తీసుకోవాలని చెప్పారు. ఫిల్మ్​ఇండస్ట్రీకి చెందిన కొందరు ’దసరా’ పేరుతో సినిమా తీస్తున్నారని, దసరా రోజు దానికి సంబంధించి ఆడియో రిలీజ్‍ ఫంక్షన్​ను ఉత్సవ వేదికపై చేసుకునేలా అవకాశం ఇస్తే వారినుంచి కొంత ఆదాయం తీసుకోడానికి ఆస్కారం ఉంటుందన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ వరంగల్​లో భవిష్యత్‍ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వ భూమిని చూడాలన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న చోట భూమిని అక్రమార్కులు కబ్జా చేస్తున్నారని చెప్పారు. వరంగల్‍ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍, మేయర్‍ గుండు సుధారాణి, కమిషనర్‍ ప్రావీణ్య పాల్గొన్నారు.