కవిత వచ్చాక బతుకమ్మ పండుగను ఉత్సవంలా జరుపుతున్నారు

కవిత వచ్చాక బతుకమ్మ పండుగను ఉత్సవంలా జరుపుతున్నారు

వరంగల్ : “ బతుకమ్మ పండుగ సందర్భంగా తోబుట్టువులకు ఇచ్చే కానుక వెలకట్టలేనిది. బతుకమ్మ చీర కూడా పుట్టింటివారి కానుక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలను తోబుట్టువులుగా భావించి వారికి 1 కోటి 2 లక్షల చీరలు పంపిణీ చేస్తోంది.” అని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. హన్మకొండ అంబేద్కర్ భవన్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఆయనతోపాటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండా ప్రకాష్ రావు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “ బతుకమ్మ పుట్టినిల్లు వరంగల్ జిల్లా. ఈ జిల్లాలో బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం ఆనందంగా ఉంది. సమైక్య పాలనలో పాలమూరు, సూర్యాపేటలో బతుకమ్మ పండుగ తెలియని పరిస్థితి. కేసీఆర్ కూతురు కవిత వచ్చిన తరువాత బతుకమ్మ పండుగ గ్రామగ్రామాన ఉత్సవంలా జరుపుతున్నారు. అమెరికాలో కూడా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు.” అని అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ నెల 28న కవిత, వచ్చే నెల 5వ తేదీన కేటీఆర్  జిల్లాలో  పర్యటిస్తారని చెప్పారు. గర్భిణీ స్త్రీలకు 12 వేల రూపాయలు, కేసీఆర్ కిట్  ఇచ్చి ఆడపడుచులకు ఆదరణ చూపించిన మహానుభావుడు కేసీఆర్ అని మంత్రి కొనియాడారు. వినయ్ భాస్కర్ దొరకడం ఇక్కడి ప్రజల అదృష్టమని, అతనికి తోడుగా నిలిచి జిల్లా అభివృద్ధి కి సహకరిస్తానని ఎర్రబెల్లి అన్నారు.

కార్యక్రమంలో ప్రభుత్వం చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ..” బతుకమ్మ ప్రకృతి సిద్ధమైన పండుగ. ప్రకృతిని ప్రతీ ఒక్కరు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. బతుకమ్మ పండుగ ప్రపంచంలో కేవలం తెలంగాణ లో మాత్రమే జరిపే పువ్వుల పండుగ. సమైక్య రాష్ట్రంలో ఈ పండుగను కనుమరుగు చేసే కుట్ర జరిగింది. మహిళల ఉద్యోగులు ఆడటానికి వీలు లేకుండా , సెలవులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు. మహిళలు బతుకమ్మ ఆడటానికి చెరువులు కూడా లేకుండా చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఆ సంస్కృతికి మళ్లీ జీవం పోసి ఊరురా పండుగను నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, రాష్ట్ర ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లాలో 3 లక్షల 61 వేల బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పల్లెలకు ఇచ్చిన ప్రణాళికను, పట్టణాల్లోనూ ప్రజలు సహకారంతో చేసి తీరుతామని చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఈ సందర్భంగా అన్నారు.

Minister Errabelli participated in the distribution of Batukamma Sarees at Hanmakonda Ambedkar Bhavan