ఆడబిడ్డలకు కేసీఆర్ కట్నం ఇస్తుండు

ఆడబిడ్డలకు కేసీఆర్ కట్నం ఇస్తుండు

సీఎం కేసీఆర్ వల్లే అభివృద్ధి పథంలో తెలంగాణ దూసుకెళ్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉప్పల్‌లో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎర్రబెల్లి.. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా దానికి కేసీఆరే కారణమన్నారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా వల్ల పింఛన్లు ఆగిపోయినా.. తెలంగాణలో మాత్రం ఇబ్బంది ఇబ్బంది లేకుండా ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలకు కేసీఆర్ మేనమామలాగా ఆదుకుంటున్నారని చెప్పారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు లక్ష రూపాయలు కట్నంగా ఇస్తున్నాని పేర్కొన్నారు. 

కేసీఆర్ వల్ల ఎదిగి.. ఆయననే తిడతారా?

‘కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామలాగా కట్నం ఇస్తున్నారు. చిన్నప్పుడు మేనమామలు కొంత బంగారమో, డబ్బులు మేనకోడలి పెళ్లికి కానుకగా ఇచ్చేవారు. ఇప్పుడు కేసీఆరే ఓ మేనమామలాగా ఆడపిల్లలకు లక్ష రూపాయలు కట్నంగా ఇస్తున్నారు. కేసీఆర్ వల్ల కోట్లు సంపాదించుకున్నోళ్లు, మంత్రి పదవి పొందినోళ్లు ఇప్పుడు సీఎంను తిడుతున్నారు. నేను కూడా ఎన్టీఆర్ దగ్గర పనిచేసి వచ్చా. నేను ఎన్టీఆర్‌‌ను తిడుతున్నానా? కానీ కేసీఆర్ దయ వల్ల ఎమ్మెల్యేలు, మంత్రులు అయినోళ్లు ఆయనను ఎందుకు తిడుతున్నారు? నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్టీఆర్, కేసీఆర్ లాంటి ఆదర్శ ముఖ్యమంత్రులను ఎప్పుడూ చూడలేదు. భూములకు రకాలు (శిస్తు) మాఫీ చేసిన ఘనత ఎన్టీఆర్‌‌దైతే.. రైతు బంధు రూపంలో అన్నదాతలకు ఎదురు డబ్బులు ఇస్తున్న ఘనత కేసీఆర్‌‌ది’ అని ఎర్రబెల్లి ప్రశంసించారు. 

‘హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు కట్టినవి కాకుండా మరో నాలుగు వేల ఇండ్లు మంజూరైనా ఇక్కడ కట్టలేదు. మీరందరూ మీ జాగాల్లో కట్టుకోండ్రి. డబ్బులు ఇప్పించే బాధ్యత నాది. రైతు రుణమాఫీ లాంటివి ఇంకా చేయాల్సి ఉంది. కరోనా వల్ల కొంత ఇబ్బందులు వచ్చాయి. ప్రధాన మంత్రి అయ్యాక పేదల అకౌంట్‌‌లో పేదల అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తానన్న మోడీ ఇప్పటిదాకా వేయలేదు. గ్యాస్ ధర తగ్గిస్తానని చెప్పిన మోడీ.. పెంచాడా? తగ్గించాడా? గిట్టుబాటు ధరలను కల్పించడంలో కేంద్రం విఫలమైంది. 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి త్వరలో పెన్షన్లు ఇస్తాం’ అని దయాకర్ రావు పేర్కొన్నారు.