మిషన్‍ భగీరథ చూసే.. టీఆర్‍ఎస్​లో చేరిన: ఎర్రబెల్లి

మిషన్‍ భగీరథ చూసే.. టీఆర్‍ఎస్​లో చేరిన: ఎర్రబెల్లి
  • మిషన్‍ భగీరథ చూసే.. టీఆర్‍ఎస్​లో చేరిన
  • సీఎం కేసీఆర్‍, స్మితా సబర్వాల్‍ వల్లే పథకం సక్సెస్‍: మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు

వరంగల్‍/హసన్‍పర్తి, వెలుగు: మిషన్‍ భగీరథ పథకం అమలు తీరు చూసే టీఆర్‍ఎస్‍ పార్టీలో చేరానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు అన్నారు. సీఎంఓ ఆఫీసర్లు స్మితా సబర్వాల్‍, ప్రియాంక వర్గీస్‍తో కలిసి మంత్రి శుక్రవారం హనుమకొండ చింతగట్టులోని మిషన్‍ భగీరథ ఆఫీస్‍లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా దయాకర్‍రావు మాట్లాడుతూ తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఏ గ్రామానికి వెళ్లినా జనాలు తాగడానికి మంచినీళ్లు ఇప్పించండని అడిగేవారని.. అప్పట్లో గ్రామ పంచాయతీ ఆదాయం మొత్తం కాలిపోయిన మోటార్ల రిపేర్లకే సరిపోయేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‍ ప్రభుత్వం వచ్చాక కూడా ప్రతిపక్ష నేతగా తాను కాలిపోయిన మోటర్లు, స్టార్టర్లతో ధర్నా చేశానన్నారు. మిషన్‍ భగీరథ పనులు నడిచేటప్పుడు తాను ఫ్లోర్‍ లీడర్‍గా ప్రతిపక్ష పార్టీలో ఉన్నానని, మంత్రిగా మధ్యలో వచ్చానన్నారు. ఈ పథకం సక్సెస్‍ కావడానికి ప్రధానంగా సీఎం కేసీఆర్‍, అధికారిగా స్మితా సబర్వాల్‍ ఇద్దరే కారణమన్నారు.  మనల్ని చూసే కేంద్రం జలజీవన్‍ పేరుతో మంచినీటి పథకం అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో మిషన్‍ భగీరథ ద్వారా ఇంటింటికి గోదావరి నీళ్లు ఇస్తుంటే.. గుజరాత్‍, ఉత్తరప్రదేశ్‍ తదితర రాష్ట్రాల్లో కేంద్రం జలజీవన్‍ ద్వారా కేవలం బోరు, బావి నీళ్లను అందిస్తున్నట్లు చెప్పారు. అవి తాగితే ఫ్లోరైడ్‍ తప్పదన్నారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధితో ఢిల్లీ వాళ్లు తెలంగాణకు అవార్డులు ఇయ్యక తప్పని పరిస్థితి నెలకొందన్నారు. కేంద్రం ఇప్పటివరకు 53 అవార్డులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశం మొత్తంలో బెస్ట్​25 గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇస్తే అందులో 19 తెలంగాణవే ఉన్నాయన్నారు. అనంతరం మిషన్‍ భగీరథ స్కీంలో పనిచేసిన అధికారులు, సిబ్బందిని సన్మానించారు. 

అంతజెప్పీ.. బిస్లరీ నీళ్లే తాగిన్రు

మిషన్‍ భగీరథ ఆఫీస్‍లో రివ్యూ నేపథ్యంలో మంత్రి దయాకర్‍రావు, అధికారుల సమక్షంలో సిబ్బంది.. ఇతర కంపెనీల వాటర్‍, మిషన్‍ భగీరథ నీటికి ఉన్న తేడాను మీడియాకు చూపారు. తాగడానికి మిషన్‍ భగీరథ నీరు ఎంతో శ్రేయస్కరమన్నారు. మంత్రి సైతం దీనికి అంగీకరించారు. తాము అందించే మిషన్‍ భగీరథ నీళ్ల గొప్పదనాన్ని అందరికీ తెలిసేలా చేయాలన్నారు. తీరా చూస్తే.. సమావేశం జరిగే హాల్‍తో పాటు వందలాది మందికి అక్కడ ఏర్పాటు చేసిన లంచ్‍ టేబుళ్ల వద్ద బిస్లరీ నీటి బాటిళ్లు పంపిణీ చేశారు.