గవర్నర్లు రాజకీయాలు చేయొద్దు: ఎర్రబెల్లి

గవర్నర్లు రాజకీయాలు చేయొద్దు: ఎర్రబెల్లి

హైదరాబాద్‌‌, వెలుగు: మోడీ ప్రధానిగా ఎనిమిదేండ్లలో తెలంగాణకు చేసిందేమీలేదని, విభజన చట్టంలోని హామీలను కూడా నెరవేర్చలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. ప్రధాని రామగుండం పర్యటనలో ప్రజలే నిరసన గళమెత్తుతారని ఆయన పేర్కొన్నారు. గురువారం టీఆర్‌‌ఎస్‌‌ ఎల్పీలో ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు.   ‘‘తెలంగాణకు అన్యాయం చేసిన మోడీ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు?  రాష్ట్రానికి ఏమీ చేయని ఆయనను ప్రజలే అడ్డుకుంటారు” అని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌‌ శాఖలో అమలవుతున్న పథకాలను మెచ్చుకుంటూ నిధుల్లో కోత పెట్టిందని, కేంద్రం తీరుతోనే సర్పంచులకు బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతున్నదని అన్నారు. కొందరు సర్పంచులు అనవసరంగా ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌‌ జాతీయ పార్టీ పెడితే  ఎక్కడ ఇబ్బంది అవుతుందేమోనని బీజేపీ  మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిందని విమర్శించారు. ‘‘గవర్నర్లు రాజకీయాలు చేయడం సరికాదు. గవర్నర్‌‌ మేడారం జాతరకు వస్తే జిల్లా మంత్రిగా ఉన్న నాకే  సమాచారం ఇవ్వలేదు” అని అన్నారు. ప్రధాని మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్‌‌ హాజరువుతారా అని మీడియా ప్రశ్నించగా.. ‘‘సీఎం దానిపై నిర్ణయం తీసుకుంటారు” అని చెప్పారు.