పల్లె ప్రగతి లాంటి స్కీమ్స్ .. దేశంలో ఎక్కడాలేవ్: మంత్రి ఎర్రబెల్లి

పల్లె ప్రగతి లాంటి స్కీమ్స్ .. దేశంలో ఎక్కడాలేవ్: మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్, వెలుగు: పల్లె ప్రగతి లాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవని పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 60 ఏండ్ల ఉమ్మడి పాలనలో తెలంగాణ ఎంతో వెనుకబడిందని.. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఊరూరా చేపట్టి గ్రామాలను అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం రవీంద్ర భారతిలో పల్లె ప్రగతి దినోత్సవంలో మంత్రులు దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలు పేరుకుపోయిన చెత్తా చెదారం, పరిసరాలు, మురుగు కాల్వల పరిశుభ్రత, ఎవెన్యూ ప్లాంటేషన్‌‌, నర్సరీలు, డంపింగ్‌‌ యార్డుల ఏర్పాటు, వైకుంఠధామాల నిర్మాణం, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలతో గ్రామాలు చాలా డెవలప్​ అయ్యాయన్నారు.

పల్లె ప్రగతి కార్యక్రమం కింద మొత్తం రూ.13,528 కోట్లను ఖర్చు చేశామన్నారు. ప్రతి గ్రామం ఓడీఎఫ్ ప్లస్ గా ప్రకటించిన ఒకే ఒక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఎనిమిదేండ్లలో కేంద్రం నుంచి 81 అవార్డులు అందుకున్నామని, ఈ ఏడాది 46 అవార్డుల్లో 13 మన రాష్ట్రానికే వచ్చాయన్నారు. ఈ సందర్భంగా జాతీయ అవార్డులు అందుకున్న సర్పంచ్ లను, సెక్రటరీలను, గ్రామాల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లను మంత్రులు సన్మానించారు.