ప్రతి పక్షాలు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు

ప్రతి పక్షాలు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు

జనగాం: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, అందుకే దేశం ఇవాళ రాష్ట్రం వైపు చూస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో నిర్వహించిన  కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పల్లె ప్రగతి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. దేశంలో 20 ఉత్తమ గ్రామపంచాయతీలకు అవార్డులు ఇస్తే అందులో 19 తెలంగాణకు చెందినవే కావడం అందుకు నిదర్శనమన్నారు. 

గత ప్రభుత్వాల హయాంలో విద్యుత్‌ పవర్‌ హాలిడేతో రెండు, మూడు రోజులు పనులు కోల్పోయేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌, రైతు బంధు, రైతు బీమా వంటి ఎన్నో పథకాలతో రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోందని చెప్పారు.  ఇది జీర్ణించుకోలేని బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు ఇలా చేస్తున్నాయంటూ విమర్శించారు.  ఇంత చేస్తున్నా తెలంగాణకు నిధులు ఇవ్వడంలో కేంద్రం కొర్రీలు పెడుతోందని, ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చేది నెల రూ.237 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు తప్పుడు హామీలతో రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే వారి మాటలను నమ్మేస్థితిలో ప్రజలు లేరని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.