గ్రామాల్లో జాబ్ మేళాలు: ఎర్రబెల్లి దయాకర్ రావు

గ్రామాల్లో జాబ్ మేళాలు: ఎర్రబెల్లి దయాకర్ రావు
  • ఉపాధి పనులతో పంచాయతీ కార్యాలయాలు కట్టాలి
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Minister Errabelli Dayakar Rao Wish to Start Job Recruitments in Villagesగ్రామాల్లో జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉపాధి చూపాలని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ముందుగా తన సొంత నియోజక వర్గం పాలకుర్తిలో జాబ్ మేళా ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామీణ ఉపాధి హామీ, సెర్ఫ్‌, స్వచ్ఛభారత్ మిషన్ అధికారులతో బుధవారం సచివాలయంలో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష నిర్వహించారు. మార్చి 31లోపు అన్ని గ్రామాలను బహిరంగ మల విసర్జన రహితంగా తీర్చిదిద్దాలని స్వచ్ఛభారత్ మిషన్ అధికారులను కోరారు. స్వయం సహాయక సంఘాలు చిన్నచిన్న వ్యాపారాలు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసరా పింఛన్ల వయసు 57 ఏళ్లకు తగ్గించిన నేపథ్యంలో కొత్త లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు సక్రమంగా జరిగేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. కొత్త గ్రామ పంచాయతీలకు నూతన కార్యాలయాలను ఉపాధి హామీ కింద చేపట్టాలన్నారు. సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్‌, కమిషనర్ నీతూకుమారి ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.