సర్వాంగ సుందరంగా గ్రామాలు

సర్వాంగ సుందరంగా గ్రామాలు

కామారెడ్డి: పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు సర్వంగ సుందరంగా తయారవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయ్ పేట్ గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... పట్టణాలకు వలసలు తగ్గి... పట్టణాల నుంచి గ్రామాలకు వలస వస్తున్నారని స్పష్టం చేశారు. పారిశుధ్య పరిశుభ్రతతో గ్రామాలు ఆరోగ్యానికి అడ్రెస్ గా మారాయని తెలిపారు. గ్రామాల్లో నర్సరీలు, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు వంటివి ఎన్నో ఏర్పాటు చేసుకున్నామన్నారు. 

రైతు వేదికలు, కల్లాలు, రైతులకు పెట్టుబడి, రైతు బీమా, పెన్షన్లు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, రోడ్లు, మురుగు నీటి కాలువలు.. ఇలా ఎన్నో  సదుపాయాలు గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్నామని, ఇవన్నీ కేసీఆర్ వల్లే సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. పేదల ఇంటికి మేనమామ గా కేసీఆర్ కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్, కేసీఆర్ కిట్లు ఇస్తున్నామని, త్వరలోనే సొంత జాగాల్లో ఇండ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. పల్లె ప్రగతి సక్సెస్ అయిందనడానికి కేంద్రం ప్రకటించిన అవార్డులే నిదర్శనమన్నారు. 
కేంద్రం నుంచి 1450 కోట్ల  బకాయిలు రావాల్సిందన్న ఆయన... కేంద్రం నిధులతో సంబంధం లేకుండా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ స్పష్టం చేశారు.