మహిళలను వేధిస్తే కఠిన చర్యలు: మంత్రి ఎర్రబెల్లి

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు:  మంత్రి ఎర్రబెల్లి

మహిళల భద్రతకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా షీ టీమ్స్ భరోసా కేంద్రాలు పెట్టి వారికి భద్రత కల్పిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అరాచకాలు చేసేవారిని ఉపేక్షించేది లేదని అన్నారు. భరోసా కేంద్రం ఏర్పాటుతో పాటు ప్రజల్లో మార్పులు తీసుకురావాలని ఆయన తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. వరంగల్ లో పోలీస్ భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేసిన ఆయన... రాష్ట్రంలో పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని అన్నారు. 

తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోలీసులకు ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత ఎవరూ ఇవ్వలేదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఒకప్పుడు మహిళల విషయంలో ఆరాచకాలు జరిగేవని.. ప్రభుత్వ చర్యల వల్ల బాధితుల సంఖ్య తగ్గిందని చెప్పారు. హోం గార్డులకు రూ.20వేల వేతనం ఇస్తున్న ఘనత ప్రభుత్వానిదేనని ఆయన తెలిపారు. భరోసా కేంద్ర భవనాన్ని త్వరగా నిర్మించాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలు జారీ చేశారు. 

షీ టీమ్స్ ద్వారా మహిళలకు భద్రత: తరుణ్ జోషి

షీ టీమ్స్  ద్వారా మహిళలకు అత్యంత భద్రత కల్పిస్తున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. వరంగల్ భరోసా కేంద్రం సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. మహిళా పోలీస్ స్టేషన్లు, భరోసా కేంద్రాల్లో.. మహిళలు తమ సమస్యలను ఫ్రెండ్లీగా చెప్పుకోవచ్చని తెలిపారు. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుందని తరుణ్ జోషి వెల్లడించారు.