కరోనాతో కేవలం 0.5% మంది మాత్రమే చనిపోయారు

కరోనాతో కేవలం 0.5% మంది మాత్రమే చనిపోయారు

కరీంనగర్ : కరోన వైరస్ ను తక్కువగా అంచనా వేయకూడదని, ఇప్పటికీ వైరస్ పూర్తిగా పోలేద‌ని, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. హుజురాబాద్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు మంత్రి. హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ ప‌ర్స‌న్‌గా బర్మవత్ రమ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన మంత్రి ఈటల మాట్లాడుతూ.. అగ్ర దేశాలు కరోనాతో వణికిపోతే.. మన దేశంలో పేద వారి పరిస్థితి ఎలా అని భ‌యపడ్డాన‌ని, ప్రజల కోసం మొదటి సారి దేవుడికి మొక్కాన‌ని అన్నారు.

కరోన వ్యాధితో ఎంతో మంది ఆత్మీయులను పోగొట్టుకున్నామ‌ని.. రాష్ట్రంలో 99.5 శాతానికి పైగా జనం వైర‌స్ సోకి బతికి బయట పడ్డారని అన్నారు.కేవలం 0.5% మాత్రమే చనిపోయారని చెప్పారు. రాబోయే పండుగలను ఎవరి ఇంట్లో వారే జరుపుకోవాలని, జ‌నం కూడి వ్యాధిని స్ప్రెడ్ చేయొద్ద‌ని కోరారు.

హుజురాబాద్ ప్రాంత ప్రజలు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి ప్రాంతాలకు వెళ్లకుండా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశామ‌న్నారు మంత్రి . త్వ‌రలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ ను కార్పొరేట్ ఆస్పత్రిగా అన్ని పరికరాలతో అభివృద్ధి చేస్తాన‌ని, అది త‌న‌ జీవితాశయ‌మ‌ని చెప్పారు.